నల్లగొండ జిల్లా: మిర్యాలగూడ పట్టణ శివారులోని ఎఫ్.సీ.
ఐ వద్ద బుధవారం రాత్రి ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను చేస్తుండగా నల్గొండ జిల్లా త్రిపురారం మండలం బాబుసాయిపేట గ్రామానికి చెందిన డీసీఎం డ్రైవర్ ఎర్ర సైదులు తన బైక్ పై స్వగ్రామం వెళ్తూ పోలీసులను చూసి బైక్ ను వెనక్కి తిప్పాడు.ట్రాఫిక్ కానిస్టేబుల్ సుధీర్ మరో అధికారి అతనిని పట్టుకోవడంతో బైకును తీసుకోండి నన్నేమీ అనొద్దని వేడుకున్నప్పటికీ కానిస్టేబుల్ ఇష్టారాజ్యంగా లాఠీతో దాడి చేయడంతో చేతివేళ్లు విరగాయని, వెంటనే ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించి చికిత్స అందించారని బాధితుడు వాపోయాడు.
విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు,సహచర డ్రైవర్లు పోలీసు దాడిని నిరసిస్తూ గురువారం ట్రాఫిక్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగడంతో
పట్టణంలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.సమాచారం అందుకున్న టూ టౌన్ సీఐ ఘటన స్థలానికి చేరుకొని ఘటనపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.
ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు,డ్రైవర్లు మాట్లాడుతూ డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుకొని జరిమానా విధించినా బాగుండేదని,లాఠీలతో కొట్టడంతో చేతివేళ్లు విరిగి ఇంటికే పరిమితం కావాల్సిన రావడంతో డ్రైవింగ్ చేసుకునే అవకాశం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.దాడి చేసిన కానిస్టేబుల్ సుధీర్ పై చర్యలు చేపట్టాలని కోరుతూ రూరల్,వన్ టౌన్,టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు బాదితుడు ఎర్ర సైదులు తెలిపారు.