సూర్యాపేట వైపు చూస్తున్న బూర?

సూర్యాపేట జిల్లా:మునుగోడులో మూగబోయిన బూర సూర్యాపేటలో స్వరాలు పలుకుతుందా? అంటే అవుననే సంకేతాలే కనిపిస్తున్నాయి.భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ టీఆర్ఎస్ కు రాజీనామా చేసి ఎట్టకేలకు బుధవారం ఢిల్లీలో బీజేపీ అగ్రనేతల సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు.

 Boora Looking Towards Suryapet?-TeluguStop.com

మునుగోడు ఉప ఎన్నిక ద్వారా టీఆర్ఎస్ నుండి బయటికి వచ్చిన బూర చూపు సూర్యాపేట నియోజకవర్గంపై పడిందని సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా సరే దీనిపైనే చర్చ జరుగుతుంది.నియోజకవర్గ పరిధిలో గౌడ సామాజిక వర్గంతో పాటు బీసీల ఓట్లు అధికంగా ఉండటం,బూర చూపు పేట వైపుకు మళ్లడానికి కీలకంగా మారిందని,బూర తన స్వస్థలం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తాళ్లగడ్డ కావడంతో ఇక్కడికి వస్తున్నారనే ప్రచారం ఊపందుకుంది.

ఇన్నాళ్లుగా టీఆర్ఎస్ లో అసంతృప్తిగా ఉన్న నేతలు,గౌడ సంఘం నాయకులు ఆయన రాకను బలంగా స్వాగతిస్తున్నట్లు తెలుస్తోంది.దీనితో సూర్యాపేట నియోజకవర్గ రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారతాయని అంచనాలు మొదలు పెట్టారు.

బూరకు అండగా బీసీ సంఘాలు.టీఆర్ఎస్ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ బీజేపీలో చేరడమే సూర్యాపేట లక్ష్యంగా జరిగిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సూర్యాపేట బీజేపీ అభ్యర్థిగా బూరను ప్రతిపాదించే అవకాశం ఉందని,అందులో భాగంగానే సోమవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బూర ఇంటికి వెళ్లి బీజేపీలోకి రావాలని స్వయంగా ఆహ్వానించే పేరుతో పేట టిక్కెట్ గురించి చెవిలో ఊదినట్లు,వెంటనే ఢిల్లీకి వెళ్లి కమలం గూటిలో చేరినట్లు పేటలో చర్చ సాగుతోంది.జిల్లా మంత్రి,సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డిపై అసంతృప్తితో ఉన్న టీఆర్ఎస్ నేతలు, నియోజకవర్గ పరిధిలో గౌడ సామాజిక వర్గం అత్యధిక సంఖ్యలో ఉండటం,బీసీల ఓటింగ్ శాతం కూడా బూరకు కలిసి వచ్చే అంశాలుగా రాజకీయ పరిశీలకులు అంచనాలు వేస్తున్నారు.దీనికి కారణం కూడా లేకపోలేదు.2004 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ నుండి పోటీచేసిన బండారు ధనుంజయ గౌడ్ కు దాదాపుగా 25వేల ఓట్లు రావటం వాటిలో అత్యధికంగా గౌడ సామాజిక వర్గం ఓట్లే కావటం విశేషం.దీనిపై అప్పట్లో తీవ్ర చర్చ జరిగిన విషయం తెలిసిందే.సూర్యాపేట 2009 వరకు కూడా ఎస్సీ రిజర్వుడ్ స్తానంగా ఉండేది.2009 నుండి జనరల్ స్థానంగా మారింది.అయినా ఇక్కడ బీసీలు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నిక కాకపోవటం బీసీ వర్గాల్లో తువ్రమైన అసంతృప్తి నెలకొంది.

అందుకే ఇక్కడ బీసీ అభ్యర్థిని నిలిపితే బీసీలతో పాటు ఎస్సీ, ఎస్టీలు కూడా మద్దతు తెలిపే అవకాశం ఉందని బీజేపీ అధిష్టానం ఓ అంచనాకు వచ్చాకే బూరకు బండితో కబురు పంపినట్లు, అదే విషయాన్ని బండి సంజయ్ బూర నర్సయ్య గౌడ్ చెవిలో ఊదినట్లు విస్తృత చర్చ జరుగుతుంది.ఇదిలా ఉండగా బూర నర్సయ్య గౌడ్ బీజేపీలో చేరడంతో ఇక్కడి అధికార పార్టీ అసంతృప్త నేతలు పక్క చూపులు చూస్తున్నారనే చర్చ కూడా నడుస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల భోగట్టా.సంకినేని పరిస్థితి ఏమిటి? తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు పేట జనరల్ స్థానంగా ఏర్పడ్డప్పటి నుండి బీజేపీ నియోజకవర్గ ఇంచార్జిగా ఉంటూ,గత ఎన్నికల్లో బీజేపీ కంటెస్టెడ్ అభ్యర్థిగా పోటీ చేశారు.2018 ముందస్తు ఎన్నికల్లో సంకినేని బీజేపీ నుండి పోటీ చేసి మూడో స్థానానికే పరిమితమవడం, పైగా స్థానికేతరుడు కావడంతో బూర వైపుకు బీజేపీ అధిష్టానం చూపు పడ్డట్లు విశ్లేషకుల అభిప్రాయం.అయితే ఇంతకాలం పార్టీని నమ్ముకుని,స్థానికంగా కార్యకర్తలకు అండగా ఉంటున్న సంకినేనికి పార్టీ సముచిత స్థానమిచ్చే యోచనలో ఉందని,భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా అవకాశం కల్పిస్తారనే ప్రచారం జరుగుతుంది.దీనికంతటికీ కారణం మంత్రి జగదీష్ రెడ్డి బూరకు మునుగోడు టిక్కెట్ రాకుండా అడ్డుకోవడం,కనీసం సరైన ప్రాధాన్యత ఇవ్వకుండా అవమానించడమేనని,అందుకే మంత్రిపై ప్రతీకారం తీర్చుకునే అవకాశం కోసమే బూర తన సొంత ఇలాకలోకి మకాం మార్చుతున్నట్లు సమాచారం.

ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే బూర పేట టిక్కెట్ ఖరారు చేసుకుంటే నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఇంకెలా ఉంటాయోనని ఎవరికి తోచినట్లు వారు అంచనాలు వేసుకుంటున్నారు.ఏం జరగబోతుందో కాలమే సమాధానం చెప్పాలి మరి!

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube