అర్ధరాత్రి భర్తను దారుణంగా హత్య చేసిన భార్య

అక్రమ సంబంధమే కారణమంటున్న కుటుంబ సభ్యులు,బంధువులు.హైదరాబాద్ లో ఉన్న భర్తను ఇంటికి రప్పించి ఘాతుకానికి వడిగట్టిన భార్య.

 The Wife Who Brutally Murdered Her Husband In The Middle Of The Night-TeluguStop.com

అక్రమ సంబంధాలతో ఆగమవుతున్న కుటుంబాలు.రెండు రోజుల వ్యవధిలో రెండు వరుస ఘటనలతో ఉలిక్కిపడిన నల్లగొండ.

నల్లగొండ జిల్లా:నేటి మానవ సమాజంలో బంధాలకు అనుబంధాలకు బంధనాలు పడుతున్నాయి.రక్త సంబంధాలు కూడా అనేకనేక అనుమానాలతో రక్తసిక్తమవుతూ మానవ సమాజ గమనాన్ని ప్రశ్నిస్తున్నాయి.

అసలే అంతంత మాత్రపు అనుబంధాల నడుమ అక్రమ సంబంధం అనే మహమ్మారి దూరి మనిషిని ఇంకాస్త పాతాళానికి దిగజార్చింది.క్షణికమైన సుఖం కోసం భార్యలను భర్తలు,భర్తలను భార్యలు కిరాతకంగా హత్యలు చేయడం,అడ్డు వస్తున్నారనే నెపంతో అమాయకులైన పసి పిల్లలను అడ్డుతొలగించుకోవడం, లేదా క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడడం పరిపాటిగా మారిందని చెప్పొచ్చు.

ఏది ఏమైనా, కారణాలు ఏవైనా సమాజంలో నేర ప్రవృత్తి విచ్చలవిడిగా పెరగడంతో మానవ సంబంధాలు దెబ్బతిని,మనిషి మృగంలా మారుతున్న వైనం సమాజ వికాసానికి చేటు కలిగిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఈ నేపథ్యంలో సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా నల్లగొండ జిల్లాలో సోమవారం అర్ధరాత్రి భర్తను అత్యంత దారుణంగా భార్యే హత్య చేసిన సంఘటన కలకలం రేపుతోంది.

వివరాల్లోకి వెళితే నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని శాలిగౌరారం మండలం చిత్తలూరు గ్రామంలో ఈ దారుణం చోటుచేసుకుంది.కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం శాలిగౌరారం మండలం చిత్తలూరు గ్రామానికి చెందిన సారికతో నకిరేకల్ మండలం మండలపురం గ్రామానికి చెందిన కిరణ్ తో 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది.

వీరి సంసార జీవితానికి గుర్తుగా ఇద్దరు పిల్లలు ఉన్నారు.ఎనిమిదేళ్ళ పాటు సాఫీగా సాగిన వీరి కాపురంలో అక్రమ సంబంధం అనే అనుమానపు పెనుభూతం కలతలు రేపింది.

భార్యాభర్తల మధ్య నెలకొన్న మనస్పర్థలతో విభేదాలు మరింత పెరిగి గత నాలుగేళ్లుగా కిరణ్,సారికలు దూరంగా ఉంటున్నారు.అప్పటి నుండి సారిక చిత్తలూరులో తల్లిగారింటి వద్దే పిల్లలతో సహా ఉంటుండగా,కిరణ్ హైదరాబాద్ లో ఓ కంపెనీలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు.

ఏమైందో ఏమో కానీ,ఉన్నట్లుండి ఆదివారం రాత్రి భర్త కిరణ్ కు భార్య సారిక ఫోన్ చేసి,పిల్లలను స్కూల్లో చేర్పించడానికి రావాలని చెప్పింది.ఇక నుండి జరిగింది మర్చిపోయి అందరం కలిసి ఉందామని నమ్మబలికింది.

ఈ విషయమై మాట్లాడడానికి తన పుట్టింటికి రావాలని పిలిపిచింది.భార్య మాటలు నమ్మిన భర్త కిరణ్ సోమవారం హైదరాబాద్ నుండి నకిరేకల్ వచ్చి భార్య సారికతో కలసి పిల్లల స్కూల్ విషయంలో ఫీజు మాట్లాడారు.

సాయంత్రం కిరణ్ ను కూడా ఇంటికి రావాలని సారిక కోరడంతో ఇద్దరు కలిసి చిత్తలూరు చేరుకున్నారు.ఎక్కడా ఏ మాత్రం అనుమానం రాకుండా జాగ్రత్త పడ్డ భార్య సారిక భర్త కిరణ్ కు అత్తారింట్లో అన్ని రకాల అల్లుడి మర్యాదలు చేసింది.

నాటు కోడి కోసి,కల్లు,మందు తెప్పించి మంచి విందు భోజనం ఏర్పాటు చేసింది.తాగి,తిని పడుకున్నాక అర్ధరాత్రి గాఢనిద్రలో ఉండగా భర్త కిరణ్ తలపై పెద్ద బండ రాయితో మోది దారుణంగా హత్య చేసింది.

అనంతరం నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి తన భర్తను తానే హత్య చేశానని నేరం ఒప్పుకొని పోలీసులకు లొంగిపోయింది.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కిరణ్ తల పగిలి చనిపోయినట్లుగా గుర్తించారు.

మృతుడు కిరణ్ తమ్ముడు కిషోర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి,పోస్ట్ మార్టం నిమిత్తం కిరణ్ మృతదేహాన్ని నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు శాలిగౌరారం సర్కిల్ ఇన్స్పెక్టర్ రాఘవరావు తెలిపారు.కిరణ్ తల్లి మారెమ్మ మాట్లాడుతూ కోడలు సారికే తన కొడుకును నమ్మించి,సోయి లేకుండా తాపించి,అర్ధరాత్రి సమయంలో కత్తితో గొంతు కోసి,బండ రాయితో తలపై మోది హత్య చేసిందని కన్నీరుమున్నీరుగా విలపించింది.

సోమవారం రాత్రి నా కొడుకు ఫోన్ చేసి అమ్మా మా అత్తగారింట్లో ఉన్నానని,పిల్లలను స్కూల్లో మాట్లాడామని అంతా బాగానే ఉందని చెప్పాడని తెల్లారేసరికి ఇలా జరిగిందని కన్నీటిపర్యంతం అయింది.తన కోడలు సారిక హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో హెల్పర్ గా పనిచేస్తున్నప్పుడు మల్లేష్ అనే వ్యక్తితో పరిచయం పెంచుకొని వివాహేతర సంబంధం పెట్టుకుందని,తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే నమ్మించి పక్కా ప్లాన్ ప్రకారమే తన కొడుకు కిరణ్ ని పిలిపించి,ఫుల్ గా తాపించి గాఢ నిద్రలో ఉండగా హత్య చేసిందని ఆరోపించింది.

తన కొడుకు ఎలాగో తిరిగి రాడని,ఉన్న ఆస్తిని మొత్తం ఇద్దరు పిల్లలకు దక్కేలా చూసి న్యాయం చేయాలని కోరింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube