సూర్యాపేట జిల్లా:అమెరికన్ సామ్రాజ్యవాదుల అండ చూసుకొని ఇజ్రాయిల్ బరితెగించి పాలస్తీనాపై చేస్తున్న దాడిని ప్రపంచ శాంతి కాముకులు మొత్తం ముక్తకంఠంతో ఖండించాలని సిపిఐ సూర్యాపేట జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు,సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి,ఎంసిపిఐ జిల్లా కార్యదర్శి నజీర్, సిపిఐ (ఎంఎల్) పార్టీ నాయకులు గంటా నాగయ్య విజ్ఞప్తి చేశారు.గాజాపై మరియు లెబనాన్ పై ఇజ్రాయిల్ చేస్తున్న దాడిని ఖండిస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ సెంటర్లో ఇజ్రాయిల్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు.
అనంతరం వారు మాట్లాడుతూ అమెరికా అండతో పాలస్తీనా ప్రజలపై అత్యంత క్రూరత్వంగా,అత్యంత కిరాతకంగా దాడి జరుపుతున్న ఇజ్రాయిల్ దుశ్చర్యలను
ప్రపంచ న్యాయస్థానం ఖండించినప్పటికీ అమెరికా అండ చూసుకొని ప్రపంచ న్యాయస్థానం మాటలు పెడచెవిన పెడుతున్న ఇజ్రాయిల్ దేశం పాలస్తీనా ప్రజలపై నీచమైన చర్యలకు దాడులకు, హత్యలకు అత్యాచారాలకు పాల్పడుతున్నదని,గత సంవత్సర అక్టోబర్ 7వ తేదీ నుంచి సాగుతున్న మారణకాండకు ఏడాది పూర్తయిందని ఇప్పటికే అనేక మంది పౌరులు చనిపోయారని,అనేక పాఠశాలలు,కాలేజీలు పూర్తిగా ధ్వంసం అయ్యాయని అక్కడి ప్రజలు ప్రాణభయంతో అల్లాడుతుంటే ఇజ్రాయిల్ పైశాచిక ఆనందం అనుభవిస్తుందని దుయ్యబట్టారు.గాజాలో ఇప్పటికే 60% భవంతులు కూలిపోయాయని,90 శాతం గాజా పూర్తిగా ధ్వంసం అయిందని, మిగిలిన ప్రజలు ఒక మూలన దాక్కొని ఉన్న పరిస్థితి ఇవాళ గాజాలో దాపురించి ఉన్నదని,ఇంత జరుగుతున్నా ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకోకపోవడం విడ్డూరంగా ఉన్నదని,
కేవలం ఐకాస అలంకారప్రాయంగానే ఉన్నదని,మన దేశానికి స్వాతంత్రం వచ్చింది మొదలుకొని పాలస్తీనా అనుకూల విధానాలనే అవలంబిస్తున్నామని,కానీ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాక ఇజ్రాయిల్ అనుకూల విధానాలు అవలంబించడం అత్యంత దుర్మార్గకరమని అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో వామపక్షాల నాయకులు అనంతుల మల్లీశ్వరి, ములకలపల్లి రాములు, కంబాల శీను,యల్లంల యాదగిరి,వరికుప్పల వెంకన్న,ధూళిపాళ ధనుంజయ నాయుడు, బద్దం కృష్ణారెడ్డి,కోట గోపి, బూర వెంకటేశ్వర్లు, ఖమ్మంపాటి రాము, నిమ్మల ప్రభాకర్, సాయికుమార్,కునుకుంట్ల సైదులు,చామల అశోక్ కుమార్,పోలబోయిన కిరణ్,తొట్ల ప్రభాకర్, దేశోజు మధు,సామ నర్సిరెడ్డి,బొల్లె వెంకన్న, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.