నల్లగొండ జిల్లా:పెద్దవూర మండల( Peddavoora ) కేంద్రంలో ఎన్నో ఏళ్ల క్రితం నిర్మించిన ప్రభుత్వ ఆసుపత్రి శిధిలావస్థకు చేరుకోవడంతో గత ప్రభుత్వ హయాంలో నూతన ఆసుపత్రి భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు.కానీ, రెండేళ్ళైనా ఇంకా నిర్మాణ దశలోనే ఉండడంతో పూర్తిగా శిధిలావస్థకు చేరుకొని,స్లాబ్ పెచ్చులు ఊడి పడుతున్న పాత భవనంలోనే ఆసుపత్రి నిర్వహణ జరుగుతుంది.
దీనితో ఎప్పుడు ఏం జరుగుతుందోనని వైద్య సిబ్బంది,రోగులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని క్షణక్షణం.భయంభయంగా గడుపుతున్నారు.
మండల కేంద్రాల్లో 30 పడకల ఆసుపత్రుల నిర్మిస్తామని చెబుతున్న మాట సంగతి దేవుడెరుగు కనీసం ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ( Primary Health Centers )కూడా పట్టించుకోకపోతే ఎలా అని మండల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
మండలంలో నిత్యం వందలాది మంది పేదలకు వైద్యం అందించే సర్కార్ ఆసుపత్రిలో కనీసం కూర్చుని వైద్యం చేసే స్థితి,పేషంట్స్ బెడ్ పై వైద్యం చేయించుకునే పరిస్థితి లేదని,రెండేళ్లకు పైగా వైద్య సిబ్బంది, రోగులు నానా తిప్పలు పడుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని వాపోతున్నారు.
రెండేళ్ళుగా కొత్త ఆసుపత్రి భవనం నిర్మాణ దశలోనే ఉండడానికి కారణం అధికారుల అలసత్వమా? కాంట్రాక్టర్ నిర్లక్ష్యమా? అని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇక్కడ విధులు నిర్వహించాలంటే వైద్య సిబ్బంది,చికిత్స కోసం రావడానికి ప్రజలు భయపడిపోతున్నారని,వర్షాలు పడితే భవనం పూర్తిగా విద్యుత్ షాక్ వస్తుందని అంటున్నారు.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి నూతన భవనం త్వరగా పూర్తి చేసి ఆసుపత్రిని షిఫ్ట్ చెయ్యాలని,దానికి ముందు పాత భవనంలో మరమ్మతులు చేపట్టి ప్రజల,వైద్య సిబ్బంది ప్రాణాలు కాపాడాలని సామాజిక కార్యకర్త తగరం శ్రీను,మండల ప్రజలు కోరుతున్నారు.నిర్మాణ పనుల అలస్యంపై సదరు కాంట్రాక్టర్ ను వివరణ కోరగా బిల్లులు లేక పనులు చేయడం లేదని చెప్పడం గమనార్హం
.