నల్లగొండ జిల్లా:నకిరేకల్ లో సమీకృత మార్కెట్ పేరుతో కూల్చివేయబడిన ప్రభుత్వ కార్యాలయ స్థలాన్ని అఖిలపక్ష నాయకులు పరిశీలించారు.ఈ సందర్భంగా బిఎస్పీ నకిరేకల్ నియోజకవర్గ ఇంఛార్జి ప్రియదర్శిని మేడి మాట్లాడుతూ సెక్రటేరియట్ వాస్తు బాలేదని 400 కోట్ల రూపాయలు వృథా చేసిన చరిత్ర ఈ ప్రభుత్వానిది,కేసీఆర్ దని,ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్న చందంగా ముఖ్యమంత్రిని ఆదర్శంగా తీసుకుని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కూడా ప్రభుత్వ భవనాలను రాత్రికి రాత్రే కూల్చివేస్తున్నారని మండిపడ్డారు.
నకిరేకల్ లో ప్రభుత్వ కార్యాలయాల కూల్చివేతను బహుజన్ సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు.ప్రభుత్వ కార్యాలయాలు రాత్రికి రాత్రే కూల్చడం,ప్రజా ధనాన్ని వృధా చేయడం ప్రభుత్వానికి పరిపాటి అయ్యిందని అన్నారు.
అయితే కార్యాలయాల కూల్చివేతలతో ఆశ్చర్యం కలగలేదని, ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ప్రజల ఆత్మస్థైర్యాన్ని ప్రతిరోజు కూల్చివేస్తూనే ఉందన్నారు.మండల పరిషత్ లో జరిగిన తీర్మానానికే దిక్కు లేకపోతే ఇక ఈ నకిరేకల్ ను ఎవరు కాపాడాలని వాపోయారు.
ఇంకా 70 సంవత్సరాలు పటిష్టంగా ఉండే సెక్రటేరియట్ నే కూల్చినోళ్లకు 40,50 సంవత్సరాలు ఉండే బిల్డింగ్ లను కూల్చడం ఓ లెక్కా అని ఎద్దేవా చేశారు.మార్కెట్ ను అనువైన చోట నిర్మించాల్సిందిపోయి ప్రభుత్వ కార్యాలయాలను కూల్చడం అసమర్థ చర్య అన్నారు.
అందుకే బాబాసాహెబ్ అంబేడ్కర్ దేశభివృద్ధి అంటే అద్దాలమేడలు,నిర్మాణాలు కావని,మనిషి యొక్క నైతికభివృద్ధి,జీవన ప్రమాణాలు పెరుగుదలని అన్నారు.కానీ,ఇవేమీ ఈ ప్రభుత్వానికి పట్టదని అన్నారు.
అభివృద్ధి కోసం పార్టీ మారానని చెప్పే ఎమ్మెల్యే తాను చేసిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు.ప్రజాప్రతినిధుల తీర్మానాన్ని బేఖాతరు చేస్తూ ఇష్టమొచ్చినట్లు వ్యవహరించడానికి ఇదేమన్నా వాళ్ల తాతల జాగీరా అని ప్రశ్నించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి కొవ్వూరి రంజిత్,నియోజకవర్గ అధ్యక్షులు గద్దపాటి రమేష్,మునుగొడు సత్తయ్య,చుక్క పుజిత,సోషల్ మీడియా ఇంఛార్జి ముత్యాల రమేష్ తదితరులు పాల్గొన్నారు.