పాలకుల నిర్లక్ష్యం ఎస్సీలకు శాపంగా మారింది.వేసవి కాలం వస్తే చాలు ప్రతీసారి నీటి కష్టాలే.
సవతి తల్లి ప్రేమను చూవుతున్న మున్సిపల్ పాలక వర్గం.వచ్చిన అరకొర నిధులను కూడా దుర్వినియోగం చేస్తున్న వైనం.
చివరికి వచ్చిన అవకాశాలను కూడా వృథా చేస్తున్న కాంట్రాక్టర్.సూర్యాపేట జిల్లా:గ్రామం మొత్తం నీటి సౌకర్యం కల్పించిన పాలకవర్గం 11 వార్డును మాత్రం గాలికొదిలేచారు.అది పూర్తిగా ఎస్సీ కాలనీ కావడమే అక్కడి ప్రజలు చేసుకున్న పాపం కావొచ్చు.దేవుడు వరమిచ్చినా పూజారి కనికరించని చందంగా ఎస్సీల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంటే కోదాడ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కోమరబండ గ్రామంలోని ఎస్సీ కాలనీ వాసులు మున్సిపల్ పాలకవర్గం,అధికారులు,కాంట్రాక్టర్ల రూపంలో ఇబ్బందులు పడుతున్నారు.
తాతల కాలం నుండి ఈ కాలనీలో నీళ్ల సౌకర్యం లేక అల్లాడుతున్నారు.ఊరంతా నీళ్లున్నా ఒక్క ఎస్సీ కాలానికే ఎందుకు నీటి ఎద్దడి వస్తుందనేది పాలకులకే తెలియాలి.
గతంలో అనేకసార్లు ఈ కాలనీలో నీటి సమస్య పరిష్కారానికి గ్రామ పంచాయతీ పాలక వర్గం కూడా సరైన చర్యలు తీసుకోకుండా చిన్నచూపు చూడడంతో నేటికి ఈ పరిస్థితి ఇలాగే ఉంది.అనంతరం కోదాడ మున్సిపాలిటీలో విలీనం చేసినా ఇక్కడ ఎస్సీల తలరాతలు మాత్రం మారలేదు.
పాలన ఏదైనా పాలకులు ఎవరైనా వారి జీవితాల్లోకి నీళ్లు మాత్రం రావడం లేదు.రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ ట్యాంక్ ఈ కాలనీలోనే నిర్మించారు.
కానీ,అది ఇప్పుడు శిథిలావస్థకు చేరుకుని నిరుపయోగంగా మారింది.ఎస్సీ కాలనీకి నీటి సౌకర్యం కోసం రెండు బోర్లు మంజూరైతే సరైన స్థలంలో వేయకుండా ఇష్టానుసారం వ్యవహరించడంతో ఆ రెండు బోర్లు పూడిపోయి ప్రజా ధనం దుర్వినియోగం అయింది.
ఇప్పుడు మళ్ళీ ఒక బోరు వేయడంతో అది సక్సెస్ అయింది.దానికి పైప్ లైన్ వేయడానికి కాంట్రాక్ట్ తీసుకున్న వ్యక్తి నాణ్యత లేని పైపులు వేసి చేతులు దులుపుకునే పరిస్థితికి తెరలేపాడు.
అతను వేస్తున్న పైపులు సి గ్రేడ్ కంటే దారుణంగా ఉండటంతో స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.కనీసం ఆరు నెలలు కూడా పని చేయని పైపులు భూమిలో వేయడం వలన రాబోయే వర్షాకాలంలో పైపులకు రిపేర్ వచ్చినా పంట పొలాల కింద పడిపోవడం వలన మరమ్మతులు చేయడానికి కుదరదని,మళ్ళీ నీటి కష్టాలు మొదటికొచ్చే అవకాశం ఉంటుందని వాపోతున్నారు.
కేవలం ఎస్సీలం అనే వివక్షతోనే ప్రతీ ఒక్కరూ ఈ విధంగా చిన్న చూపు చూస్తున్నారని,ఇది సరైన పద్ధతి కాదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా కోదాడ మున్సిపల్ అధికారులు స్పందించి కొమరబండ గ్రామంలోని 11వ వార్డు ఎస్సీ కాలనీలో నాణ్యతలేని వాటర్ పైపులను గ్రౌండ్లో వేస్తున్న కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులు కోరుతున్నారు.