సూర్యాపేట జిల్లా:బుధవారం రాత్రి 65వ జాతీయ రహదారిపై మునగాల మండలం ముకుందాపురం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తండ్రి కొడుకులు మృతి చెందగా,తల్లికి తీవ్ర గాయాలలైన ఘటన మండలంలో విషాదం నింపింది.వివరాల్లోకి వెళితే మునగాల మండల కేంద్రానికి చెందిన వల్లోజు నాగరాజు(32)భార్య వినోద(27)కుమారుడు మణికంఠ (08నెలలు)మండల పరిధిలోని ముకుందాపురం గ్రామంలో బంధువుల ఇంట్లో జరిగే ఓ శుభకార్యనికి బుధవారం సాయంత్రం బైకుపై బయల్దేరారు.సుమారు రాత్రి 8:30 గంటల సమయంలో ముకుందాపురం గ్రామంలో జాతీయ రహదారిపై యూ టర్న్ తీసుకుంటుండగా హైదరాబాద్ నుండి కోదాడకు వేగంగా వస్తున్న కారు ఢీకొట్టడంతో బాలుడు మణికంఠ అక్కడిక్కడే మృతి చెందగా, నాగరాజు కుడి కాలు తెగిపడి తీవ్ర గాయాలవగా, భార్య వినోదకు తీవ్ర గాయాలయ్యాయి.క్షతగాత్రులను 108 అంబులెన్స్ లో కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మెరుగైన వైద్యం కోసం భార్యాభర్తలను ఖమ్మం ఆసుపత్రికి తరలించారు.నాగరాజు పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడ నుండి హైదరాబాద్ తరలించారు.హైదరాబాద్ లో చికిత్స పొందుతున్న నాగరాజు గురువారం తెల్లవారు జామున ఆసుపత్రిలో మృతి చెందాడు.అక్కడి నుండి మృతదేహాన్ని కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించి, సాయంత్రం మునగాలలో తండ్రి కొడుకులకు ఒకేసారి అంత్యక్రియలు నిర్వహించారు.నాగరాజు భార్య వినోద ప్రస్తుతం ఖమ్మం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నది.
నాగరాజుకు ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు.తండ్రీ నాగరాజు,తమ్ముడి మణికంఠ మృతదేహాలను చూసి ఇద్దరు కుమార్తెలు రోధిస్తున్న తీరు గ్రామంలోని ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది.
ఈ ఘటనతో గ్రామంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి.ముకుందాపురం గ్రామంలో జాతీయ రహదారిపై రోడ్డు క్రాసింగ్ చేసే దగ్గర అండర్ పాసింగ్ ఇవ్వకపోవడం వలన ఇక్కడ నిత్యం ప్రమాదాలు జరిగి అనేకమంది మృత్యువాత పడ్డారు.
వందల్లో అంగవైకల్యం పొందారు.ఇక్కడ అండర్ పాసింగ్ ఏర్పాటు చేయాలని గ్రామస్తులు అనేకసార్లు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించినా ప్రభుత్వం,జీఎంఆర్ వారిలో ఎలాంటి చలనం లేకపోవడంతో,వారి నిర్లక్ష్యానికి మరో కుటుంబం చిన్నాభిన్నం అయిందని మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ముకుందాపురం వద్ద అలాగే జిల్లాలో రోడ్డు క్రాసింగ్ చేసే ప్రతీ చోటా అండర్ పాసింగ్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మునగాల పోలీసులు తెలిపారు.
.