తెలంగాణ కాంగ్రెస్ లో లుకలుకలు, గ్రూపు రాజకీయాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు.ప్రత్యేక తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి రావాల్సి ఉన్నా, రెండుసార్లు ఓటమి చెందింది.
దీని అంతటికి కారణం పార్టీలో ఏకాభిప్రాయం లేకపోవడం.గ్రూపు రాజకీయాలు పెరిగిపోవడం, సీనియర్లు, జూనియర్ల మధ్య తరచుగా అభిప్రాయ బేదాలు రావడంతో ఇప్పటికీ తెలంగాణలో కాంగ్రెస్ ఎదురు ఈదుతోంది.
ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి సీనియర్లు మరింతగా రగిలిపోతున్నారు.తమకంటే జూనియర్ అయిన వ్యక్తిని పార్టీలోకి తీసుకొచ్చి కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించడాన్ని ఇప్పటికీ చాలామంది సీనియర్ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు.
దీంతో రేవంత్ ను అడ్డుకునేందుకు తరచుగా పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తూ, తమ సత్తా చాటుకునేందుకు సీనియర్లు ప్రయత్నిస్తూనే వస్తున్నారు.ఈ తరహా వ్యవహారాలు , గ్రూపు రాజకీయాల కారణంగా కాంగ్రెస్ పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతుండడం పై ఏఐసిసి దృష్టి సారించింది.
ముఖ్యంగా పిసిసి చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డి వ్యవహార శైలికి సంబంధించి సీనియర్లు, ఇతరుల నాయకుల నుంచి అనేక ఫిర్యాదులు తరచుగా వస్తూ ఉండడంతో, దీనికి కారణాలు ఏమిటి అని ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరా తీశారు.అసలు తెలంగాణలో ఈ పరిస్థితి ని చక్కదిద్దే బాధ్యతను తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్, ఇన్చార్జి కార్యదర్శులు బోసురాజు, రోహిత్ చౌదరి, నదీం జావేద్ లకు అప్పగించారు.
అసలు సీనియర్ నాయకులు రేవంత్ కు మధ్య అభిప్రాయ భేదాలు రావడానికి కారణం ఏమిటి? దీనికి పరిష్కారం ఏమిటి అనేది తేల్చాలని మల్లికార్జున ఖర్గే మాణిక్యం ఠాగూర్ ను ఆదేశించారు.ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ ను వీడి ఇతర పార్టీలో చేరాలనుకుంటున్న నాయకులను గుర్తించి, వారితో చర్చించి వారి అసంతృప్తిని పోగొట్టి పార్టీలో యాక్టివ్ అయ్యేలా చేయాలని ఖర్గే సూచించారు.ఢిల్లీలో తనను కలిసిన ఏఐసిసి కార్యదర్శులతో మల్లికార్జున ఖర్గే ఈ విధంగా వ్యాఖ్యానించారు.
అలాగే పార్టీ రాష్ట్ర వ్యవహారాలు , మునుగోడు ఉప ఎన్నికలు , మర్రి శశిధర్ రెడ్డి రాజీనామా, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి షోకాజ్ నోటీసులు, రేవంత్ రెడ్డి పై తరచుగా వస్తున్న ఫిర్యాదులు, ఇలా అన్ని అంశాల పైన ఆయన చర్చించినట్లు సమాచారం.పార్టీ సీనియర్ నేతగా ఉన్న మర్రి శశిధర్ రెడ్డి పార్టీని వీడే అవకాశం ఉందని ముందే తెలిసినా, పిసిసి చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డి తో పాటు, ఇతర కీలక నాయకులు ఆయనను బుజ్జగించే ప్రయత్నం ఎందుకు చేయలేదని మల్లికార్జున ఖర్గే అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం.