రాష్ట్రపతి భవన్( Rashtrapati Bhavan ) చరిత్రలో మొదటిసారి ఓ అరుదైన ఘటన చోటు చేసుకోబోతోంది.రాష్ట్రపతి వ్యక్తిగత భద్రతాధికారి (పీఎస్వో)గా విధులు నిర్వర్తిస్తున్న ఓ మహిళా ఉద్యోగి వివాహానికి రాష్ట్రపతి భవన్ వేదిక కానుంది.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము( President Droupadi Murmu ) స్వయంగా అనుమతి ఇవ్వడంతో, ఈ నెల 12న మదర్ థెరిస్సా క్రౌన్ కాంప్లెక్స్‌లో ఈ వివాహం జరగనుంది.సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ పూనమ్ గుప్తా( CRPF Assistant Commandant Poonam Gupta ) ఈ అరుదైన గౌరవాన్ని అందుకున్నారు.
జమ్మూ కశ్మీర్‌లో అసిస్టెంట్ కమాండెంట్‌గా సేవలందిస్తున్న అవనీశ్ కుమార్ తో( Awanish Kumar ) ఆమె వివాహం జరగనుంది.పూనమ్ భద్రతా సిబ్బందిలో ఉండటమే కాక, విధుల్లో అత్యంత అంకితభావంతో పనిచేయడం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆకట్టుకుంది.
అందుకే, ప్రత్యేక అనుమతి ఇచ్చి రాష్ట్రపతి భవన్ లోనే ఈ వివాహాన్ని జరిపించాలని నిర్ణయించారు.

మధ్యప్రదేశ్ రాష్ట్రం శివపురి జిల్లా శ్రీరామ్ కాలనీ కి చెందిన పూనమ్ గుప్తా, చిన్ననాటి నుంచే అత్యుత్తమ విద్యాబుద్ధులతో ఎదిగారు.ఆమె తండ్రి రఘువీర్ గుప్తా నవోదయ విద్యాలయంలో ఆఫీస్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్నారు.గణితంలో గ్రాడ్యుయేషన్, ఆంగ్ల సాహిత్యంలో పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, బీఈడీ చేశారు.
ఆ తర్వాత 2018లో యూపీఎస్సీ నిర్వహించిన CAPF పరీక్షలో 81వ ర్యాంక్ సాధించి, సీఆర్పీఎఫ్‌లో అసిస్టెంట్ కమాండెంట్‌గా పోస్టింగ్ అందుకున్నారు.ఆపై 2024 గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో సీఆర్పీఎఫ్ మహిళా దళానికి నాయకత్వం వహించారు.

పూనమ్ గుప్తాతో వివాహ బంధం కుదుర్చుకున్న అవనీశ్ కుమార్ కూడా సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్.ఇద్దరూ సమానమైన ఉద్యోగస్థాయిలో ఉండటంతో, వారి పెళ్లి మరింత ప్రత్యేకతను సంతరించుకుంది.భద్రతా కారణాల దృష్ట్యా ఈ వివాహానికి కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే ఆహ్వానించబడ్డారు.భారత రాష్ట్రపతి భవన్‌లో ఒక సాధారణ ఉద్యోగి వివాహం జరగడం చారిత్రక సంఘటన.
పూనమ్ విధుల పట్ల అంకితభావం, సమర్ధతను గమనించి రాష్ట్రపతి ముర్ము ఈ ప్రత్యేక అనుమతిని ఇచ్చారు.దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.ఈ ప్రత్యేక వివాహం రాష్ట్రపతి భవన్ చరిత్రలో నిలిచిపోయే ఘటనగా మిగిలిపోనుంది
.