అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.దేశ ప్రజలపై పన్నుల భారం తగ్గించి.
అమెరికాకు వచ్చే విదేశీ ఎగుమతులపై పన్నులు పెంచాలని ఆయన భావిస్తున్నారు.పలుమార్లు ఇదే విషయంపై ట్రంప్ (Trump)హింట్ ఇచ్చారు కూడా.
ప్రధానంగా కెనడా, మెక్సికోలపై(Mexico, Canada) దాదాపు 25 శాతంపైగా సుంకాలు పెంచాలని ట్రంప్ భావిస్తున్నారు.కెనడా ఎగుమతి చేసే చమురుపై 10 శాతం పన్ను విధించాలని ట్రంప్ యంత్రాంగం కసరత్తు చేస్తుండగా.
ఫిబ్రవరి మధ్యలో చమురు, గ్యాస్‌పై ట్యాక్స్(Tax ,oil and gas) పెంచాలని ఆయన యోచిస్తున్నారు.
అమెరికాకు మూడు అగ్రశ్రేణి వ్యాపార భాగస్వాములుగా ఉన్న దేశాలపై ప్రతీకారం తీర్చుకోవాలని ట్రంప్ తొలి నుంచి పట్టుదలగా ఉన్నారు.
మెక్సికో, కెనడాల నుంచి వచ్చే వస్తువులపై 25 శాతం, చైనా (China)నుంచి వచ్చి దిగుమతులపై 10 శాతం కొత్త సుంకాలను విధించే ఉత్తర్వులపై ట్రంప్ శనివారం సంతకం చేసే అవకాశాలు ఉన్నాయి.దీని వల్ల ఏకంగా 2.1 ట్రిలియన్ డాలర్లకు పైగా వార్షిక వాణిజ్యంపై అంతరాయం కలిగించే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

చైనా, మెక్సికో, కెనడాల నుంచి అమెరికాలోకి ఫెంటానిల్, ఇతర రసాయనాల (Fentanyl, other chemicals)ప్రవాహాన్ని ఆపడానికి, అలాగే దక్షిణ, ఉత్తర అమెరికా సరిహద్దులు దాటకుండా అక్రమ వలసదారులను ఆపడానికి బలమైన చర్యలు తీసుకోవడానికి ఫిబ్రవరి 1ని గడువుగా ట్రంప్ నిర్ణయించారు.సుంకాల పెంపు అనేది బేరసారాల సాధనాలు కాదని ఇటీవల మీడియా ప్రతినిధులతో అమెరికా అధ్యక్షుడు అన్నారు.సుంకాల పెంపు వల్ల అమెరికాకు పెద్ద ఎత్తున ఆదాయం వస్తుందని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.

యూఎస్ సెన్సస్ బ్యూరో డేటా ప్రకారం 2023లో దాదాపు 100 బిలియన్ డాలర్లకు చేరుకున్న కెనడా చమురు ఎగుమతులు అమెరికా దిగుమతుల్లో అగ్రస్థానంలో ఉంది.అధిక సుంకాల కారణంగా వినియోగదారులపై అధిక ఖర్చులు మోపబడతాయని, తన చర్యలు స్వల్పకాలంలో అంతరాయాలకు కారణమవుతాయని ట్రంప్ అంగీకరించారు.అయితే ఆర్ధిక మార్కెట్లపై వాటి ప్రభావం గురించి తాను ఆందోళన చెందడం లేదన్నారు.