గ్యాస్ సిలిండర్లు(Gas cylinders) పేలే ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం.అయితే మొన్న జనవరి 30న తమిళనాడులోని సేలం హైవేపై గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలిపోయింది.
ఈ ఘటన చిన్నప్పంపట్టి వద్ద చోటుచేసుకుంది.అక్కడ నాలుగు వరుసల రోడ్డు నిర్మాణం జరుగుతోంది.
పేలుడుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.వీడియోలో, ఒక ట్రక్కు మంటల్లో కాలిపోతూ ఉండటం స్పష్టంగా కనిపిస్తుంది.మంటలను ఆర్పడానికి ఒక వ్యక్తి బకెట్ నీటితో ట్రక్కు వైపు పరుగెత్తుకుంటూ వెళ్తున్నాడు.మరొక వ్యక్తి మరింత దగ్గరగా వెళ్లడానికి ప్రయత్నించిన సమయంలో సిలిండర్ ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలిపోయింది.
పేలుడు ధాటికి శిథిలాలు గాల్లోకి ఎగిరిపడ్డాయి.అదృష్టవశాత్తూ, ఆ సమయంలో ట్రక్కు దగ్గర ఇతర వాహనాలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
ఈ ప్రమాదంలో 24 ఏళ్ల మాధవన్ అనే యువకుడి కాలికి కాలిన గాయాలయ్యాయి.పేలుడు తర్వాత అతను రోడ్డుపై కుప్పకూలిపోయాడు.వెంటనే స్థానికులు అతన్ని చికిత్స కోసం దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ప్రమాదం జరిగిన సమయంలో అక్కడున్న మిగిలిన వారందరూ సురక్షితంగా బయటపడ్డారు.ఇలాంటి ప్రమాదం జరగడం ఇదే మొదటిసారి కాదు.సరిగ్గా నెల రోజుల క్రితం, డిసెంబర్ 20న, జైపూర్-అజ్మీర్ హైవేపై భంక్రోటా వద్ద గ్యాస్ ట్యాంకర్ లారీని ఢీకొనడంతో భారీ పేలుడు సంభవించింది.
ట్యాంకర్ యూ-టర్న్ తీసుకుంటున్న సమయంలో వెనుక నుంచి వేగంగా వస్తున్న లారీ ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో 18 మంది అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
రోడ్డు పరిస్థితులు సరిగా లేకపోవడం, ప్రమాదకరమైన మలుపులు, నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.జైపూర్-అజ్మీర్ హైవే తరచూ ప్రమాదాలకు నిలయంగా మారుతోంది.అక్కడ జరుగుతున్న రోడ్డు నిర్మాణాలు, సరైన ట్రాఫిక్ నిర్వహణ లేకపోవడం వల్ల పరిస్థితి మరింత దారుణంగా తయారైందని అంటున్నారు.ఈ ఘటనలు గ్యాస్ సిలిండర్లను రవాణా చేసేటప్పుడు ఎంత ప్రమాదకరమో తెలియజేస్తున్నాయి.
అంతేకాకుండా హైవేలపై మరింత కఠినమైన భద్రతా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ ప్రమాదాలు గుర్తు చేస్తున్నాయి.