వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం వివిధ దేశాలకు వలస వెళ్లిన భారతీయులు మన సంస్కృతిని, ఆచార వ్యవహారాలను అక్కడ కూడా విస్తరిస్తున్నారు.అంతేకాకుండా మనకు మాత్రమే సొంతమైన భారతీయ వంటకాలను విదేశీయులకు కూడా రుచిచూపిస్తున్నారు.
అనకాపల్లి నుంచి అమెరికా వరకు ఇప్పుడు అన్ని దేశాలలో భారతీయ రెస్టారెంట్లు పరదేశీయులను కూడా ఆకట్టుకుంటున్నాయి.మన వంటకాల రుచికి వారు కూడా వహ్వా అనాల్సిందే.
అందుకే ఏ దేశంలో చూసినా మన హోటళ్లు, రెస్టారెంట్లు నిత్యం కిటకిటలాడుతూ వుంటాయి.ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు మన భారతీయుల కంటే అక్కడి స్థానికులే ఎక్కువగా ఆ హోటళ్లకు ఎగబడుతున్నారు.
ఈ నేపథ్యంలో కర్ణాటక రాష్ట్రం మంగళూరుకు చెందిన ఎన్ఆర్ఐ ఎవరెస్ట్ విజయ్ డాంటే యాజమాన్యంలోని ప్రఖ్యాత శాఖాహార రెస్టారెంట్ ‘‘ఉడిపి మద్రాస్ కేఫ్’’ (యూఎంసీ)కి కెనడాలో ప్రతిష్టాత్మక అవార్డ్ వరించింది.ఉడిపి మద్రాస్ కేఫ్‌కి ‘‘ బెస్ట్ ఇండియన్ రెస్టారెంట్ – గోల్డ్ అవార్డ్’’ దక్కింది.
గడిచిన 15 ఏళ్లుగా కెనడాలోని మిస్సిసాగా నగరంలో అంతర్జాతీయ కమ్యూనిటీకి ఉడిపి మద్రాస్ కేఫ్ రెస్టారెంట్ సేవలందిస్తోంది.ఆరోగ్యకరమైన, పోషక విలువలను కలిగివున్న దక్షిణ భారత శాఖాహారం అందించడం ఈ కేఫ్ ప్రత్యేకత.
ఈ సందర్భంగా ఉడిపి మద్రాస్ కేఫ్ యజమాని విజయ్ డాంటే మాట్లాడుతూ.తాము డైన్ ఇన్, టేక్ ఔట్, క్యాటరింగ్, డెలివరీ సేవలు అందిస్తున్నట్లు చెప్పారు.దక్షిణ భారతదేశానికి చెందిన అల్పాహారం, భోజనం తమ వద్ద లభిస్తుందన్నారు.ఒకేసారి 10 లేదా 2000 మంది అతిథులు కేఫ్‌ను బుక్ చేసుకోవచ్చని విజయ్ తెలిపారు.గడిచిన అనేక సంవత్సరాలుగా ఉడిపి మద్రాస్ కేఫ్ టొరంటోలోని అన్ని ప్రధాన ఈవెంట్‌లకు వేదికగా నిలిచిందని ఆయన చెప్పారు.కన్నడ, తెలుగు, మలయాళ, తమిళ కమ్యూనిటీలతో పాటు ఇతర దక్షిణాసియా ప్రజలు కేఫ్‌కు వస్తారని విజయ్ తెలిపారు.
గడిచిన కొన్నేళ్లుగా ఎన్నో ఈవెంట్‌లు, కొన్ని వందల పెళ్లిళ్లు, వెయ్యికి పైగా లైవ్ దోశ పార్టీలను నిర్వహించడం తమకు గర్వంగా వుందన్నారు.