ఏపీ రాజధానిగా అమరావతి మాత్రమే కొనసాగించాలంటూ , ఆ ప్రాంత మహిళలు, రైతులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు ఎప్పటి నుంచో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయినా వైసీపీ ప్రభుత్వం మాత్రం మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నామంటూ ప్రకటనలు చేస్తూ ఉండడం, అమరావతి కేవలం శాసన రాజధానిగా మాత్రమే ఉంచుతాము అంటూ ప్రకటనలు చేయడం , తదితర కారణాలతో ఆ ప్రాంత రైతులు మరింతగా ఈ ఉద్యమాన్ని జనాల్లోకి తీసుకెళ్లాలని, అన్ని ప్రాంతాల ప్రజల మద్దతు కూడగట్టాలనే ఆలోచనతో అమరావతి టు తిరుపతి మహా పాదయాత్రకు శ్రీకారం చుట్టారు.
ఈ యాత్రకు టిడిపి పరోక్షంగా మద్దతు ప్రకటించగా , బిజెపి దూరంగానే ఉంటూ వచ్చింది. అయితే ఇటీవల తిరుపతికి వచ్చిన బిజెపి కీలక నేత కేంద్ర హోంమంత్రి అమిత్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.
అమరావతి బీజేపీ నేతలు అమరావతి ఉద్యమంలో పాల్గొనాలని, ఇది అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు చక్కటి అవకాశం అని గట్టిగా క్లాస్ పీకడం తో , ఏపీ బీజేపీ నేతల్లో కదలిక వచ్చింది .
ఈ రోజు మహా పాదయాత్ర లో బిజెపి ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, పురంధరేశ్వరి, సుజనా చౌదరి తదితరులు పాల్గొన్నారు.అయితే బిజెపి ఏపీ నేతలు కొంతమంది మొదట్లో అమరావతి కి మద్దతు ప్రకటించగా , బిజెపిలోని మరో వర్గం వ్యతిరేకించింది.దీనికి తగ్గట్లుగానే కేంద్ర బిజెపి పెద్దలు సైతం మూడు రాజధానులకు మద్దతు అన్నట్లుగా మాట్లాడారు.
స్వయంగా పార్లమెంటులోనూ అమరావతి వ్యవహారం పై క్లారిటీ ఇచ్చారు.ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికే తమ మద్దతు అన్నట్లుగా వ్యవహరించారు .అయితే ఇప్పుడు మాత్రం అమరావతి వ్యవహారంలోనూ ఉద్యమం చేపట్టాలని ఏపీ బిజెపి నేతలకు అధిష్టానం పెద్దలు సూచించడం, పాదయాత్రలో పాల్గొనడం వంటి వ్యవహారాలు చోటుచేసుకున్నాయి.

అయితే అమరావతి రైతులు మాత్రం బిజెపి నేతల వైఖరిని నమ్మలేకపోతున్నారు.కేవలం రాజకీయ లబ్ధి గురించి తప్ప , వాస్తవంగా అమరావతి ఉద్యమం పై బిజెపి ఏపీ నేతలకు , కేంద్ర బిజెపి పెద్దలకు సదభిప్రాయం లేదని, అలా ఉండి ఉంటే ఎప్పుడో జగన్ ను ఈ విషయంలో బుజ్జగించో, భయపెట్టో ఒప్పించి ఉండేవారనే విషయాన్ని అమరావతి ప్రాంత రైతులు ప్రస్తావిస్తున్నారు.బిజెపి నేతలు పాదయాత్రలో పాల్గొనడాన్ని పైకి స్వాగతిస్తున్నా, లోలోపల మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తుండడం గమనార్హం.