నేడు ఉప్పల మల్సూర్ వర్ధంతి...!

సూర్యాపేట జిల్లా: ఒక్కసారి ప్రజాప్రతినిధిగా గెలిస్తేనే రూ.వందల కోట్లు సంపాదిస్తున్న వైనం నేటి రాజకీయాల్లో కనిపిస్తున్న చేదు నిజం.

 Uppala Malsur Death Anniversary Today, Uppala Malsur, Uppala Malsur Death Annive-TeluguStop.com

ఒక మున్సిపల్ కౌన్సిలర్ గా గెలిస్తెనే అదేదో మంత్రి పదవిగా భావిస్తూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ రూ.లక్షలు ఆర్జిస్తున్న నాయకగణం మన కళ్ళ ముందే తిరుగుతూ ఉన్నారు.అలాంటిది నాలుగుసార్లు ఎమ్మెల్యే అయితే ఇంకేమన్నా ఉందా ఓ పది తరాలు కూర్చొని తిన్నా తరగని సంపద పోగేయడం ఖాయం.కానీ,ఇప్పటి నేతలకు భిన్నంగా,నిజమైన,నిఖార్సైన, నిజాయితీగల నాయకుడు ఎవరైనా ఉన్నారా అంటే టక్కున గుర్తుకు వచ్చే పేరు ఉప్పల మల్సూర్.

సూర్యాపేట జిల్లా కేంద్రానికి 24 కి.మీ.దూరంలో మోతె మండలం సిరికొండ గ్రామంలో 1928 సెప్టెంబర్ 8న నిరుపేద మాదిగ దంపతులైన ఉప్పల మల్లయ్య,లచ్చమ్మకు జన్మించారు ఉప్పల మల్సూర్.నాలుగువ తరగతి వరకు చదివి చిన్నతనం నుండి కమ్యూనిస్టు భావాలకు ఆకర్షితుడయ్యారు.

ఈ క్రమంలో తాతతండ్రుల మాదిరిగానే కులవృత్తిలో భాగంగా చెప్పులు కుట్టుకుంటూ ఇంటికి తోడుగా ఉన్నారు.బాల్యం నుండే ఆయన మనస్సు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం వైపు మళ్ళింది.

ఈ క్రమంలో వయసుతో పాటు అనుభవం, అవగాహన పెంచుకుంటూ యుక్త వయసు వచ్చేసరికి సిపిఐ(ఎం) నాయకులు ఖబడ్దార్ వెంకన్న సారథ్యంలో పనిచేశారు.పోరాటకాలంలో భీమిరెడ్డి నరసింహారెడ్డి, బొమ్మగాని ధర్మభిక్షం, మద్దికాయల ఓంకార్,దొడ్డ నరసయ్య,నంద్యాల శ్రీనివాస్ రెడ్డి,దాతుల రాజారెడ్డి వంటి నాయకులు పరిచయం కావడంతో పాటు వారి సహచర్యంతో కమ్యూనిస్టుగా రాటుతేలారు.

సాయుధ పోరాటంలో అత్యంత ధైర్యసహసాలతో ప్రజల తరపున నైజాం పాలనపై తరువాత కరుడు కట్టిన నెహ్రూ సేనలపై 1946 నుండి 1951 వరకు ప్రాణాలకు తెగించి పోరాడారు.

ఈ పోరాట క్రమంలోని 1948లో సూర్యాపేట సమీపంలోని చివ్వేంల మండలం చందుపట్ల గ్రామంలో పోలీసులకు చిక్కి చిత్రహింసలకు గురయ్యారు.

తెలంగాణలో తమకు చిక్కిన మల్సూరును నాటి పాలకులు ఈ ప్రాంతానికి దూరంగా రాజమండ్రి సబ్ జైలుకు తరలించారు.అక్కడే ఆయన విద్యపై పట్టు సాధించారు.

నిత్య అధ్యయన చర్యలతో సైద్ధాంతికంగా బలపడ్డారు.పోరాట విరమణ తర్వాత 1951లో తోటి కామ్రేడ్లతో కలిసి జైలు నుండి విడుదలయ్యారు.

అనంతరం 1952 ఎన్నికల నాటికి సూర్యాపేట నియోజకవర్గంలో ప్రజాభిప్రాయం సేకరణ చూరగోన్న ప్రజా నాయకుడయ్యారు.ఆ ఎన్నికల నాటికి కమ్యూనిస్టు పార్టీపై నిషేధం ఉండడంతో పీపుల్స్ డెమొక్రటిక్ ఫ్రంట్ పేరిట పోటీ చేయాలని నిర్ణయించిన పార్టీ, మల్సూర్ ను సూర్యాపేట ఎమ్మెల్యేగా పోటీలో నిలిపింది.

నామినేషన్ వేయడానికి కూడా డబ్బు లేకపోవడంతో ప్రజలే ఎన్నికల ఖర్చులు సమకూర్చి ఘన విజయానికి బాటలు వేశారు.ఈ క్రమంలోనే 1952 నుండి 1972 వరకు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.1952 -57లో పిడిఎఫ్ తరఫున, 1962 సిపిఐ పక్షాన,1967లో సిపిఐ(ఎం) తరపున శాసనసభ్యుడిగా గెలుపొందారు.1990లో సిరికొండ సర్పంచిగా పనిచేశారు.1957 ఎన్నికల్లో ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ తరఫున గెలిచినా 1964లో కమ్యూనిస్టు పార్టీలో చీలిక రావడంతో ఆయన మార్కిస్టు పార్టీలో కొనసాగాలని నిర్ణయించుకున్నారు.అనంతరం 1972లో సిపిఐ(ఎం) తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి మరింత మెజార్టీతో గెలుపొందారు.

మొత్తంగా 20 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా ఆయన వ్యక్తిగత స్వార్థం కోసం,కుటుంబ ఆర్దిక ఎదుగుదల కోసం ఆలోచించలేదు.

కేవలం అభాగ్యుల పక్షాన వ్యవస్థలో మార్పు కోసం విరామమెరుగక కృషి చేసిన మహోన్నత వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయారు.

తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కూడా సైకిల్ పై ప్రజల్లోకి వెళ్లి సమస్యలను తెలుసుకొని పరిష్కరించేవారు.కాగా కాలక్రమంలో ప్రజాసేవలో తన వయస్సు,శ్రమశక్తిని కోల్పోయారు.

ఆర్థికంగా చితికిపోయే దశలో 1990లో సిరికొండ గ్రామంలో సర్పంచ్ గా పనిచేశారు.ఈ క్రమంలో ప్రజా సమస్యలతో మమేకమయ్యారు.

చెప్పులు కుట్టుకుంటూ చివరి దశలో పూరి గుడిసెలో గడుపుతూ 2000 జనవరి 13 న తుదిశ్వాస విడిచారు.ఆయన భార్య లచ్చమ్మ కూడా ఆర్థికంగా చితికిపోయి కొంతకాలానికి దీనస్థితిలో అనారోగ్యంతో మృతి చెందింది.

వారి సంతానం ఉన్నప్పటికీ వారు కూడా ఇప్పటికీ సరైన ఇల్లు లేకుండా సాధారణ జీవితం గడుపుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube