అమెరికాలో స్థిరపడి నాలుగు రాళ్లు సంపాదించాలని అనుకుంటున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది.కుదిరితే రాచబాట.
లేకుంటే దొడ్డిదారి అన్నట్లుగా కొందరు భారతీయులు(Indians) భావిస్తున్నారు.అక్రమంగా సరిహద్దులు దాటుతూ అక్కడి అధికారులకు చిక్కుతున్న వారి సంఖ్య భారీగా ఉంటోంది.
జైళ్లలో మగ్గుతున్న వారు , ఈ ప్రయాణంలో ప్రాణాలు పొగొట్టుకుంటున్న వారు తక్కువేం కాదు. డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఇలాంటి వారికి గట్టి షాక్ ఇచ్చారు.
అమెరికాలో అక్రమంగా ఉంటున్న విదేశీయులను దేశం నుంచి బహిష్కరిస్తున్నారు ట్రంప్(Trump).మిలటరీ విమానాల ద్వారా అక్రమ వలసదారులను వారి వారి స్వదేశాలకు తరలిస్తున్నారు.ఈ లిస్ట్‌లో భారతీయులు కూడా ఉంటున్నారు.ఇప్పటికే దాదాపు 200 నుంచి 300 మందిని విడతల వారీగా భారత్‌కు తరలించారు ట్రంప్.
భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ తరలింపుకు మద్ధతు పలికారు.చట్ట విరుద్ధంగా మరో దేశంలో ఉండటం తప్పేనని ఇటీవల అమెరికా పర్యటన సందర్భంగా మోడీ వ్యాఖ్యానించారు.

ఇంత జరుగుతున్నా దొడ్డిదారిన అమెరికాలోకి వెళ్లేవారి సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు.తాజాగా సరిహద్దులు దాటి అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తూ ఓ భారతీయుడు ఇమ్మిగ్రేషన్ అధికారులకు దొరికిపోయాడు. గుజరాత్‌కు(Gujarat) చెందిన ఏసీ పటేల్ (AC Patel)అనే ఓ వ్యక్తి మహ్మద్ నజీర్ హుస్సేన్ (Mohammad Nazir Hussain)అనే పాకిస్తాన్‌కు చెందిన వ్యక్తి పేరుతో అమెరికాలోకి ప్రవేశించడానికి ప్రయత్నించాడు.అయితే అధికారులు ఈ మోసాన్ని గుర్తించి తక్షణం అదుపులోకి తీసుకున్నారు.
ఆ వెంటనే పటేల్‌ను భారతదేశానికి తిప్పి పంపినట్లుగా జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

ఫిబ్రవరి 12న ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న పటేల్ తీసుకెళ్లిన పాకిస్తానీ పాస్‌పోర్ట్ నకిలీది కాదని.పాకిస్తాన్‌కు చెందిన మహ్మద్ నజీర్ హుస్సేన్ దానిని పొగొట్టుకున్నాడని ఇమ్మిగ్రేషన్ అధికారులు గుర్తించారు.పాస్‌పోర్ట్ మోసం, దుర్వినియోగం ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు అతనిని అరెస్ట్ చేశారు.
పోలీసుల విచారణలో పాకిస్తానీ గుర్తింపును పొందడానికి దుబాయ్‌లోని ఒక ఏజెంట్‌కు తాను డబ్బు చెల్లించానని పటేల్ అంగీకరించాడు.పటేల్ పాస్‌పోర్ట్ గడువు 2016లోనే ముగిసినట్లుగా అధికారుల విచారణలో తేలింది.







