సూర్యాపేట జిల్లా:పేట మున్సిపాలిటీ పేరుకు ఆదర్శ మున్సిపాలిటీ అయినా నిత్యం వేలాదిమంది ప్రయాణించే 60 ఫీట్ల రోడ్డులో గత నెల రోజులుగా వీధిలైట్లు వెలగక అంధకారం రాజ్యమేలుతుందని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు.రాత్రిపూట రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో వాహనాలు ఎటు వస్తున్నాయో ఎటు వెళుతున్నాయో కనిపించక ఇబ్బందులు పడుతున్నారని, రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకునే నాధుడు కరువయ్యాడని వాపోతున్నారు.
ఈ రహదారిపై అధిక మొత్తంలో పాఠశాలలు, కళాశాలలు ఉండడంతో రద్దీ ఎక్కువగా ఉంటుందని,అంతే కాకుండా సాయంత్రం 6 నుండి 8 గంటల ప్రాంతాల్లో కళాశాలలు పాఠశాలలు వదిలిపెట్టడంతో చీకట్లో విద్యార్థులు ఎటు వెళ్లాలో తెలియక అవస్థలు పడుతున్నారని,సైకిల్ పై వెళ్లే విద్యార్థినిలు, యువతుల పరిస్థితి దారుణంగా ఉంటుందని,చీకట్లో ఎదురుగా వచ్చే వారు,వాహనాలు కనిపించక నడిపించుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని అంటున్నారు.పోలీసులు ఇటీవల ఈ రహదారిపై పాఠశాలలు,కళాశాలల సహకారంతో రోడ్డు మొత్తం సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారని,అసలు కరెంట్ స్తంభాలపై ఉన్న వీధిలైట్లే వెలగక పని చేయనప్పుడు సీసీ కెమెరాలు ఎలా పనిచేస్తాయని ప్రజలు చర్చించుకుంటున్నారు.