రాజన్న సిరిసిల్ల జిల్లా :హౌస్ లిస్టింగ్ సర్వే లో ప్రతి కుటుంబం వివరాలు తప్పులు లేకుండా సేకరించాలని అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ ఆదేశించారు.సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల సర్వే(సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే)లో భాగంగా సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని ఒకటో వార్డ్, అలాగే కోనరావుపేట మండలం కొలనూర్, ధర్మారంలో కొనసాగుతున్న సర్వే ప్రక్రియను అదనపు కలెక్టర్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ ఎన్యుమరేటర్ బ్లాక్ పరిధిలోని దాదాపు పది ఇండ్లలో చేపట్టిన హౌస్ లిస్టింగ్ సర్వేను పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు.
అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడారు.సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల సర్వే(సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే)లో భాగంగా తేదీ 01.11.2024 నుండి 03.11.2024 వరకు హౌస్ లిస్టింగ్ సేకరిస్తారని వివరించారు.ఇక్కడ ఎస్డీసీ రాధాభాయ్, సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ లావణ్య తదితరులు పాల్గొన్నారు.
నిబంధనలకు అనుగుణంగా సరుకులు ఇవ్వాలి
రేషన్ దుకాణాల్లో ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా లబ్ధిదారులకు సరుకులు ఇవ్వాలని అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ ఆదేశించారు.సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని ఒకటో వార్డులోని రేషన్ దుకాణాన్ని అదనపు కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
లబ్ధిదారులకు సరుకులు పంపిణీ చేస్తున్న విధానాన్ని పరిశీలించారు.దుకాణంలో నిల్వ ఉన్న సరుకులు, రిజిస్టర్లు తనిఖీ చేసి, నిర్వాహకులకు పలు సూచనలు చేశారు.