రాజన్న సిరిసిల్ల జిల్లా: తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం మరో మారు విస్మరించిందని నేడు జరిగిన బడ్జెట్ కేటాయింపుల్లో మరోసారి తెలంగాణ రాష్ట్రానికి నిరాశే ఎదురైందని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్(2025-26) పై ప్రభుత్వ విప్ స్పందిస్తూ అన్ని వర్గాలను నిరాశపర్చిన బడ్జెట్ ఇదని,వరుసగా ప్రజలకు పదోసారి నిరాశే మిగిలిందన్నారు.
రాజీవ్ గాంధీ, పి.వి.నరసింహారావు,డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రులుగా ఉన్న సమయంలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లు దేశాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాయనీ తెలిపారు.గత పది సంవత్సరాలతో పాటు ప్రస్తుత బడ్జెట్ పూర్తిగా విఫలమై దేశ పురోగతిని అడ్డుకున్నాయన్నారు.
ప్రజలను గందరగోళపర్చడమే ప్రధానమంత్రి మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లక్ష్యమని స్పష్టమైందనీ, పేదలు,యువత, రైతులు,మహిళలు.ఈ నాలుగు వర్గాలను అభివృద్ధి ఇంజిన్‌లుగా పేర్కొన్న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో చెప్పిన నాలుగు వర్గాలకు పూర్తిగా నిరాశే మిగిలిందన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో 8 మంది బిజెపి పార్లమెంటు సభ్యులు, ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్న సాధించింది సున్నా అని అన్నారు.కేవలం ఎన్నికలు ఉన్న రాష్ట్రాలకు పెద్ద మొత్తంలో వరాలు ప్రకటించి, ఎన్నికలు లేని రాష్ట్రాల పట్ల వివక్ష చూపడం సరికాదన్నారు.
మొదటి నుంచి కేంద్ర ప్రభుత్వం ఇదే దోరణిని ప్రదర్శిస్తూ రాజకీయ అవసరాలు తీర్చుకుంటున్నదనీ దుయ్యబట్టారు.
ఢిల్లీ, బీహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర బడ్జెట్ తయారు చేసినట్టు ఉందని అన్నారు.
ఐదు సార్లు బడ్జెట్‌లో బీహార్ అంశాలను ప్రస్తావించారనీ బడ్జెట్‌లో తెలంగాణ అంశం కానీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు గురించి మాట్లాడ లేదని తెలిపారు.విభజన హామీలు, ట్రైబల్ యూనివర్సిటీ గురించి చెప్పలేదన్నారు.
తెలంగాణ రాష్ట్రాన్ని బడ్జెట్‌లో నిర్లక్ష్యం చేశారని,తెలంగాణతో తమకు బంధం లేదని ఈ రోజు బడ్జెట్ ద్వారా మరోసారి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిరూపించింది అని ధ్వజమెత్తారు.