రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.ఉదయం స్వస్తి పుణ్యావాచనం, అంకురార్పణ, కలశ స్థాపన, కలశ ప్రతిష్ట, గాయత్రి హవనం తదితర కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం శ్రీస్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పరివార దేవతలు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి లలితా సహస్రనామ సహిత చతుషష్టి పూజలను ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛారణల మధ్య వైభవంగా నిర్వహించారు.
దేవి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా మొదటిరోజు శ్రీ రాజరాజేశ్వరీ దేవి శైలపుత్రి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.పది రోజులపాటు అమ్మవారు శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్ర గంట, కుష్మాండ, స్కంద మాత, కాత్యాయిని, కాళరాత్రి, మహాగౌరి, శ్రీ రాజరాజేశ్వరి సిద్దిదా అవతార అలంకారాలలో భక్తులకు దర్శనం ఇవ్వనుంది.
దేవీ నవరాత్రి ఉత్సవాల ఈ సందర్భంగా ఆలయంలో జరిగే ఆర్జిత సేవలైన కళ్యాణం, కుంకుమ పూజలు, అభిషేకాలు,అన్న పూజలను అధికారులు రద్దు చేశారు.