అర్హులైన చివరి లబ్ధిదారుడు వరకు సంక్షేమ పథకాల అమలు - మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

రాజన్న సిరిసిల్ల జిల్లా: రాష్ట్రంలోనే చివరి లబ్ధిదారుడి వరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందని రాష్ట్ర నీటిపారుదల ,పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.బుధవారం రాష్ట్ర నీటి పారుదల , పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి , రాష్ట్ర బీసీ రవాణా శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ లతో కలిసి రుద్రంగి మండల కేంద్రంలో నిర్వహించిన గ్రామ సభ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 Implementation Of Welfare Schemes Till The Last Eligible Beneficiary Minister Ut-TeluguStop.com

ఈ సందర్భంగా మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి మాట్లాడుతూ, మహిళలకు, రైతులకు, రైతు కూలీలకు, నిరుద్యోగులకు , పేదలకు ఈ స్థాయిలో ఏ ప్రభుత్వం స్వతంత్ర భారతదేశంలో మేలు చేయలేదని అన్నారు.ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి సుమారు 90 లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయని, గత 10 సంవత్సరాల కాలంలో ఎప్పుడు ఈ స్థాయిలో రేషన్ కార్డులు ఇవ్వలేదని, కేవలం 40 వేల కార్డులు మాత్రం అందించారని అన్నారు.

జనవరి 26 నాడు ప్రారంభించి రాష్ట్రంలో అర్హత ఉన్న చివరి వ్యక్తి వరకు రేషన్ కార్డు వచ్చే వరకు ప్రక్రియ కొనసాగుతుందని, రాజకీయాలకు అతీతంగా రేషన్ కార్డులు జారీ చేస్తున్నామని, ప్రజా పాలన కేంద్రాలలో దరఖాస్తు చేసిన, మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసినా, గ్రామ సభలలో దరఖాస్తు ఇచ్చిన విచారించి అర్హత మేరకు కార్డులు మంజూరు చేస్తామని అన్నారు.

గ్రామ సభలో ప్రకటించే ప్రాథమిక జాబితాలో పేరు లేని పక్షంలో దరఖాస్తు సమర్పిస్తే అర్హతను పరిశీలించి రేషన్ కార్డు మంజూరు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.

ప్రజలు మండల కేంద్రాలు మున్సిపాలిటీలలో ఉన్న ప్రజాపాలన కేంద్రాలలో కూడా దరఖాస్తులు సమర్పించవచ్చని మంత్రి పేర్కొన్నారు.రేషన్ కార్డుల ద్వారా ప్రజలకు ప్రస్తుతం దొడ్డు బియ్యం సరఫరా అవుతున్నాయని, వీటిని చాలా మంది తినడం లేదని, నూతన రేషన్ కార్డుల జారీ తరువాత ప్రతి ఒక్కరికి 6 కీలోల నాణ్యమైన సన్న బియ్యం రేషన్ కార్డుల ద్వారా సరఫరా చేస్తామని అన్నారు.

ఉమ్మడి రాష్ట్రం ఉన్న సమయంలో సాచురేషన్ పద్దతిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మించామని, రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత మరోసారి ఇందిరమ్మ ఇండ్లు పథకం ప్రారంభిస్తున్నామని, స్థానిక ఎమ్మెల్యే సొంత ఊరు కాబట్టి ఇక్కడ 100 శాతం అర్హులకు మొదటి దఫా లోనే ఇండ్లు మంజూరు అవుతాయని అన్నారు.

ప్రస్తుతం సొంత జాగా ఉండి ఇండ్లు లేని వారికి 5 లక్షల రూపాయలు అందిస్తున్నామని, ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకు ఇంటి నిర్మాణానికి 6 లక్షల సహాయం అందజేయ బోతున్నామని అన్నారు.

రైతు భరోసా కింద రైతులకు అందే సహాయం 20 శాతం పెంచి ఎకరానికి 12 వేల రూపాయలు అందజేస్తామని, వ్యవసాయ యోగ్యమైన భూమికి పంట వేసిన వేయకుండా రైతు భరోసా అందుతుందని అన్నారు.భూమిలేని కూలీలకు స్వతంత్ర భారతదేశంలో ఎక్కడ లేని విధంగా రైతు కూలీల కుటుంబాలకు 12 వేల రూపాయలు ఇస్తున్నామని తెలిపారు.

ఈ నాలుగు పథకాలను గ్రామసభలు నిర్వహించే ప్రజల సమక్షంలోనే లబ్ధిదారులను ఎంపిక చేసి జనవరి 26 నుంచి అమలు చేస్తామని, అర్హులైన చివరి వ్యక్తి వరకు లబ్ధి జరుగుతుందని అన్నారు.

మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ప్రజా ప్రభుత్వం అమలు చేస్తుందని, గ్రామ సభలలో ప్రతిపక్ష పార్టీ నాయకులు అవసరమైన సలహాలు సూచనలు అందించాలని కోరారు.

జనవరి 26 నుంచి ప్రారంభించి అర్హత ప్రకారం రేషన్ కార్డులను అందరికీ జారీ చేస్తామని అన్నారు.

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, రుద్రంగి గ్రామ ప్రజలు తమ బిడ్డను ఎమ్మెల్యేగా గెలిపించాలని చేసిన కృషి ఫలితంగా తాను నేడు ఎమ్మెల్యే అయ్యానని అన్నారు.43 వేల 100 ఎకరాలకు సాగు నీరు అందించే సూరమ్మ ప్రాజెక్టు ను మొదటి ప్రాధాన్యత లో పెట్టామని, ఈ పనులను త్వరలో ప్రారంభం అయ్యేలా చూడాలని ఆయన మంత్రిని విజ్ఞప్తి చేశారు.రుద్రంగి మండలం మానాల లో పాత చెరువు కొత్త చెరువుకు లిఫ్ట్ అందించే త్రాగు, సాగు నీటికి ఇబ్బందులు ఉండవని , మంజూరు చేయాలని మంత్రికి వినతిపత్రం అందించారు.

ప్యాకేజీ 9 లో మలక్ పేట్ రిజర్వాయర్ లో టీఎంసి నీళ్లు నింపామని, 25 కోట్లు విడుదల చేస్తే అప్పర్ మానేరు కు నీళ్లు తీసుకుని వెళ్ళవచ్చని , ఈ నిధులను ప్రాధాన్యత క్రమంలో విడుదల చేయాలని ప్రభుత్వ విప్ కోరారు.వేములవాడ, తిప్పా పూర్, కథలాపూర్ బస్టాండ్ ఆధునికరణ కు నిధులు మంజూరు చేయాలని రవాణా శాఖ మంత్రిని కోరారు.

జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రుద్రంగి మండల కేంద్రంలో ప్రాథమికంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా క్రింద 103 , రైతు భరోసా క్రింద 1927 , నూతన రేషన్ కార్డుల కోసం 802, ఇందిరమ్మ ఇండ్ల కోసం 1375 మంది లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగిందని అన్నారు.గతంలో సాంకేతిక కారణాల వల్ల వివరాలు, దరఖాస్తుల సమర్పించని ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి అర్హత మేరకు పథకాలు అమలుకు చర్యలు చేపట్టామని అన్నారు.

అనంతరం మంత్రులు కలికోట – సూరమ్మ ప్రాజెక్ట్ పనులను పరిశీలించారు.పనులు వేగంగా పూర్తి చేసి, ప్రాజెక్ట్ పరిధిలోని భూములకు సాగునీటిని ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.మిగిలిన ఇతర పనులకు అన్ని నిధులను త్వరలోనే మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube