కరోనా ధాటికి ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు అల్లాడిపోతున్నారు.లెక్కకి మించిన కేసులు, మరణాలు చూసి ఆందోళన చెందుతున్నారు.
ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయోనని ప్రాణాలు అరచేత పట్టుకుని బిక్కు బిక్కుమంటూ బ్రతికే పరిస్థితి నెలకొంది.ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో కరోనా కొత్త వేరియంట్ ఒమెక్రాన్ కేసులు తీవ్ర స్థాయిలో నమోదవడంతో అన్ని దేశాల ప్రజలు భయాందోళనలకు లోనవుతున్నారు.
అయితే వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరగడంతో ప్రస్తుతం మరణాల సంఖ్య తీవ్ర స్థాయిలో లేదని ఆందోళన చెందాల్సిన అవసరం లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు నిపుణులు. భారత్ లో వేగంగా వ్యాక్సినేషన్ జరగడంతో ఒమెక్రాన్ ప్రభావం పెద్దగా కనిపించక పోవచ్చునని అంటున్నారు…అయితే
భారత్ లో వ్యాక్సినేషన్ కేవలం పెద్దలకు మాత్రమే ఇవ్వగా పిల్లలకు వ్యాక్సినేషన్ విషయంలో ఇప్పటి వరకూ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు.
మరో పక్క ఒమెక్రాన్ మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది.ఈ నేపథ్యంలో పిల్లలకు వ్యాక్సినేషన్ అందించే దేశాలకు భారత్ లోని పిల్లల తల్లి తండ్రులు క్యూ కడుతున్నారు.
లక్షల రూపాయలు వెచ్చించి మరీ ఎల్లలు దాటి తమ పిల్లలకు వ్యాక్సిన్ లు చేయించుకుని వస్తున్నారు.
అగ్ర రాజ్యంలో 5 నుంచీ 12 ఏళ్ళ వయసు ఉన్న పిల్లలకు వ్యాక్సిన్ లు చేయడానికి అనుమతులు ఇవ్వడంతో అమెరికా వెళ్లి మరీ వ్యాక్సిన్ లు చేయిస్తున్న వారు ఉన్నారట.
అలాగే మరి కొందరు ఇజ్రాయిల్ వెళ్లి మరీ వ్యాక్సిన్ చేయించుకుంటున్నారట.ఇందుకు గాను వారు సుమారు 3 లక్షల పైనే ఖర్చు చేస్తున్నారని తెలుస్తోంది.
అయితే ఈ స్థాయిలో భారీ ఖర్చు చేసి మరీ ఎందుకు వ్యాక్సిన్ చేయిస్తున్నారంటే.భారత్ లో పిల్లలకు వ్యాక్సినేషన్ అందుబాటులోకి ఇప్పటి వరకూ రాలేదు, అసలు వస్తుందా రాదా అనేది కూడా తెలియదు, మరో పక్క స్కూళ్ళు తెరుస్తున్న పరిస్థితి, ఇంకో పక్క ఒమెక్రాన్ కేసుల విజృంభణ ఈ నేపథ్యంలో పిల్లలను బడులకు పంపాలంటే ఆందోళనగా ఉందని అందుకే వ్యాక్సిన్ వేసే దేశాలకు వెళ్లి వ్యాక్సినేషన్ పూర్తి చేసుకుని రావాల్సి వస్తోందని అంటున్నారు.