సాధారణంగా ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలను 9 రోజులపాటు ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు.బ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి కల్యాణ వేడుకను జరుపుతారు.9 రోజుల పాటు జరిగే బ్రహ్మో త్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి బ్రహ్మోత్సవాలలో పాల్గొనడం మనం చూస్తూనే ఉంటాం.కానీ మూడు నెలల పాటు బ్రహ్మోత్సవాలు జరిగే ఆలయం గురించి మీరు ఎక్కడైనా విన్నారా? అవును మూడు నెలల పాటు బ్రహ్మోత్సవాలు జరిగే శైవ క్షేత్రం మన తెలంగాణ రాష్ట్రం లో కొలువై ఉంది.ఈ ఆలయంలో మల్లికార్జునస్వామి కొలువై ఉండి భక్తులు కోరిన కోరికలు నెరవేర్చే దేవుని గా ప్రసిద్ధి చెందాడు.
తెలంగాణ రాష్ట్రం సిద్దిపేటలో వెలసిన ప్రముఖ దేవాలయం కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం.
ఈ ఆలయంలో స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఆదివారం (జనవరి 17) నుంచి మొదలవుతాయి.సంక్రాంతి పండుగ తరువాత ప్రారంభమైన ఈ ఉత్సవాలు ఉగాది పండుగ వరకు కొనసాగుతుంటాయి.
ఈ విధంగా మూడు నెలల పాటు బ్రహ్మోత్సవాలు జరుపుకునే ఏకైక శివాలయం కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం అని చెప్పవచ్చు.

మూడు నెలల పాటు సాగే ఈ బ్రహ్మోత్సవాలకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి స్వామివారి మొక్కులను తీరుస్తూ ఉంటారు.ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా వచ్చే మొదటి ఆదివారాన్ని”పట్నం వారం” గా పిలుస్తారు.ఈ వారంలో పెద్ద ఎత్తున హైదరాబాద్ కు చెందిన భక్తులు తరలి రావడం వల్ల ఈ వారాన్ని ఆ విధంగా పిలుస్తారు.
ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజున పెద్ద పట్నం, ఉగాదికి ముందు వచ్చే ఆదివారం అగ్నిగుండాల కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారు.ఈ ఆలయంలోని మల్లికార్జునస్వామి 11వ శతాబ్దంలో ఇంద్రకీలాద్రి పర్వతంపై వెలసినట్లుగా అక్కడి శాసనాలు తెలియజేస్తాయి.
ఈ మల్లికార్జున స్వామి వారు ఒక గొర్రెల కాపరికి కలలో కనిపించి ఇంద్రకీలాద్రి పర్వతంపై వెలసినట్లు చెప్పారని అక్కడి ప్రజలు భావిస్తారు.ఈ విధంగా ప్రతి సంవత్సరం సంక్రాంతి తర్వాత మొదలైన ఈ బ్రహ్మోత్సవాలు ఉగాది పండుగ వరకు జరగడం ఎంతో విశేషం.
ఈ విధంగా మూడు నెలల పాటు బ్రహ్మోత్సవాలను జరుపుకునే శైవక్షేత్రంగా కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందిందని చెప్పవచ్చు.