అధ్యక్ష ఎన్నికలకు ముందు అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్‌కు( Donald Trump ) గట్టి ఎదురుదెబ్బ తగిలింది.హష్ మనీ ట్రయల్ (శృంగార తార స్టార్మీ డేనియల్ కేసు)లో ఆయనను న్యూయార్క్ కోర్టు( New York Court ) దోషిగా తేల్చింది.
దాదాపు 34 అంశాల్లో ట్రంప్‌ను దోషిగా నిర్ధారించగా .జూలై 11న ఆయనకు న్యాయస్థానం శిక్షను ఖరారు చేయనుంది.ఇలా ఓ కేసులో దోషిగా తేలిన తొలి అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంపే కావడం గమనార్హం.మరో ఐదు నెలల్లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న వేళ కోర్టు తీర్పు అమెరికా రాజకీయాల్లో కలకలం రేపుతోంది.
ట్రంప్ దోషిగా తేలిన నేపథ్యంలో ఆయనకు మద్ధతు ప్రకటించారు భారత సంతతి నేత, బిలియనీర్ వివేక్ రామస్వామి.( Vivek Ramaswamy ) ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
ఈ కేసు ప్రాసిక్యూటర్ ఓ రాజకీయ నేత అని, న్యాయమూర్తి కుమార్తె డెమొక్రాటిక్ పార్టీలో క్రీయాశీలకంగా వ్యవహరిస్తోందని, గతంలో ఆ పార్టీ కోసం నిధులను సైతం సమీకరించిందని వివేక్ గుర్తుచేశారు.ఇవన్నీ ఖచ్చితంగా ఏదో ఒక రోజున బెడిసి కొడతాయని ఆయన తన ట్వీట్‌లో హెచ్చరించారు.
కాగా.స్టార్మీ డేనియల్‌తో( Stormy Daniels ) ట్రంప్ సన్నిహితంగా గడిపారని ఆరోపణలు ఎప్పటి నుంచో వస్తున్నాయి.2016 అధ్యక్ష ఎన్నికల సమయంలో ఆమె ఈ సంగతి బయటపెట్టకుండా ఉండేందుకు ట్రంప్ భారీ మొత్తంలో డబ్బు ముట్టజెప్పారని , తన లాయర్ ద్వారా స్టార్మీకి సొమ్ము అందజేశారని అభియోగాల్లో పేర్కొన్నారు.ప్రచారం కోసం అందిన విరాళాల నుంచి ట్రంప్ ఈ మొత్తాన్ని కేటాయించారని ఆరోపించారు.
ఇందుకోసం వ్యాపార రికార్డులను తారుమారు చేశారని కూడా ట్రంప్‌పై మొత్తంగా 34 అభియోగాలు మోపారు.మరోవైపు ట్రంప్‌తో తనకు అక్రమ సంబంధం ఉన్నట్లు స్టార్మీ న్యాయస్థానంలో వాంగ్మూలం ఇచ్చారు.
న్యాయస్థానం దోషీగా తేల్చడంతో ట్రంప్ జైలుకెళ్తారా. అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకోవాల్సిందేనా అన్న చర్చ జరుగుతోంది.అయితే దోషిగా తేలినంత మాత్రాన ట్రంప్ అభ్యర్ధిత్వానికి వచ్చిన ప్రమాదం ఏం లేదని, గతంలోనూ ఇలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయని న్యాయ నిపుణులు గుర్తుచేస్తున్నారు.దోషిగా తేలి గృహ నిర్బంధాన్ని ఎదుర్కొన్నా వర్చువల్‌గా ట్రంప్ ప్రచారం చేసుకోవచ్చని వారు చెబుతున్నారు.
కోర్టు శిక్ష ఖరారు చేసిన అనంతరం ట్రంప్ దీనిపై పై కోర్టులో అప్పీల్ చేసుకునే వెసులుబాటు కూడా ఉందని అంటున్నారు.