లోకులు పలు కాకులు అనే సామెత మనం చాలా సార్లు వినే ఉంటాం.అంటే లోకంలో ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడతారని అర్థం.
ఒకరి గురించి ఏది పడితే అది మాట్లాడే వారికి ఈ సమాజంలో కొదవలేదు.మామూలు ప్రజలే కాకుండా కళాకారుల్లో కూడా ఇలాంటి మనస్తత్వం ఉన్న వారు చాలామందే ఉన్నారు.
కళాకారులు ఇతర కళాకారుల గురించి ఎంత చులకనగా, అవమానకరంగా మాట్లాడుతారో చెప్పడానికి తాజాగా ఒక ఉదాహరణ నిలుస్తోంది.
కేరళ రాష్ట్రం, త్రిసూర్ జిల్లాలోని కళామండలంలో కళాకారులు కథాకళి, మోహినీయాట్టం, కుడియాట్టం, తుళ్లల్‌తో సహా కూచిపూడి, భరతనాట్యం వంటి క్లాసికల్ డ్యాన్సులు నేర్చుకునే వారు.జూనియర్ సత్యభామ( Junior Sathyabama ) కూడా ఇక్కడ మొహినీయాట్టం నేర్చుకున్నారు.అసాధారణమైన ప్రతిభతో గొప్ప పేరు తెచ్చుకున్న ఆమె చాలామంది విద్యార్థులకు తన విద్యను ధారపోశారు.
అయితే ఇటీవల ఆమె మోహినీయాట్టం గురించి మాట్లాడుతూ మగవారిని చులకన చేసింది.మోహినీయాట్టం మోహినీ అవతారం నుంచి వచ్చిందని, మోహినీ అంటే అందంగా, ఆకర్షణీయంగా ఉండాలని ఆమె చెప్పుకు వచ్చింది.
“మగవాళ్లు నల్లగా, వంకరటింకర కాళ్లతో ఉంటారు కాబట్టి వారు మోహినీయాట్టం చేస్తే అసహ్యంగా అనిపిస్తుంది, మగ వాళ్ల ముఖాలు కాకుల వలె ఉంటాయి కాబట్టి వారిని కన్న తల్లులు కూడా చూడలేరు” అని ఆమె కామెంట్స్ చేసింది.దానితో కేరళ రాష్ట్ర ప్రజలందరూ ఆమెను ఏకిపారేశారు.
అయితే ఆమె మోహినీయాట్టం కళాకారుడు ఆర్.ఎల్.వి.రామకృష్ణన్( RLV Ramakrishnan ) (66) ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసినట్లు చాలామంది అర్థం చేసుకున్నారు.రామకృష్ణన్ ప్రముఖ యాక్టర్ దివంగత కళాభవన్ మణికి( Kalabhavan Mani ) తమ్ముడు అవుతాడు.దళిత కుటుంబంలో పుట్టిన ఆయన మోహినీయాట్టంలో చాలా నైపుణ్యం సాధించి పీహెచ్డీ కూడా అందుకున్నాడు.
ఆయన చాలా కాలంగా విమర్శలను ఎదుర్కొంటున్నాడు.ఇప్పుడు జూనియర్ సత్యభామ కూడా అతడిని వెక్కిరిస్తూ వ్యాఖ్యలు చేసింది.
అయితే మానవ హక్కుల సంఘం ఇప్పుడు ఆమెపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తోంది.ఒక కళ ప్రదర్శించడానికి అందం అవసరం లేదని చాలామంది వాదిస్తున్నారు.
నాట్య శాస్త్రంలో అందమంటే ఆహార్యం, అభినయం, ముద్రలే కానీ నలుపు రంగు, తెలుపు రంగు వంటి తేడాలు ఏమీ ఉండవు.అయితే జూనియర్ సత్యభామ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్న వేళ ఆర్.ఎల్.వి.రామకృష్ణన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.కేరళలోని ప్రతి చోటా మోహినీయాట్టం ప్రదర్శనలు ఇవ్వాలని తనకు ఉందని అన్నాడు.
తద్వారా వర్ణ వివక్షతకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతానని చెప్పాడు.జూనియర్ సత్యభామ లాంటి ఎంతోమంది లోకులు కాకులు లాగా ప్రవర్తిస్తారని, వారిని పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోవాలన్నట్లు రామకృష్ణ మాట్లాడటం చాలా మంది మనసులను గెలుచుకుంది.