ఆమె ఒక తల్లి, కూతురు, సోదరి, భార్య.వీటన్నింటికి మించి ఒక పోరాట యోధురాలు.
శక్తి యుక్తులు కలిగిన నారీమణి.అతని వెంట ఆమె కాదు.
అన్నింటా ఆమే.అదే ఇప్పుడు ఆమె లక్ష్యం.ఆవకాయ పెట్టడం నుంచి అంతరిక్షానికి చేరుకునే వరకు.అగ్గి పెట్టెల తయారీ దగ్గర్నుంచి యుద్ధ విమానాలు నడిపే వరకు అన్నింటా ఆమె ఉనికి కనిపిస్తోంది.ఆమె ఆకాశంలో సగం కాదు.ఇప్పుడు ఆమే ఆకాశం.
పురుషాధిక్య సమాజంలో మగవాళ్లను తోసిరాజని మహిళలు దూసుకెళ్తున్నారు.ఆ రంగం ఈ రంగం అని లేకుండా ఇప్పుడు అన్నింటా ఆమె తోడ్పాటు లేకుండా ఏ వ్యక్తి కానీ, ఏ వ్యవస్థ కానీ ఏం చేయలేరని ఎన్నో సార్లు రుజువైంది.
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం కెనడా వెళ్లిన భారతీయుల్లో మహిళలు కూడా వున్నారు.వీరు అక్కడ కీలక బాధ్యతలు నిర్వర్తిస్తూ భారతదేశ కీర్తి ప్రతిష్టలను రెపరెపలాడిస్తున్నారు.
భారత సంతతికి చెందిన అనితా ఆనంద్ కెనడా రక్షణ శాఖ మంత్రిగా ఇటీవల నియమితులైన సంగతి తెలిసిందే.54 ఏళ్ల అనితా ఆనంద్ ఓక్ విల్లే నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.అనితా ఆనంద్ తల్లిదండ్రులు భారతీయులే.తల్లి పంజాబ్‌కు చెందిన డాక్టర్ సరోజ్ దౌలత్ రామ్, తండ్రి తమిళనాడుకు చెందిన డాక్టర్ సుందర్ వివేక్ ఆనంద్.2019 అక్టోబర్‌లో అనిత కెనడా పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు.హౌస్ ఆఫ్ కామన్స్‌కు ఎన్నికై, ప్రధాని జస్టిన్ టూడ్రో కేబినెట్‌లో మంత్రి పదవి దక్కించుకున్న మొదటి హిందూ మహిళగా రికార్డుల్లోకెక్కారు.
ఇక అసలు విషయంలోకి వెళితే.కెనడాలోని అత్యంత శక్తివంతమైన 100 మంది మహిళల జాబితాలో పలువురు భారత సంతతికి చెందిన మగువలు చోటు దక్కించుకున్నారు.వీరిలో నిర్మాత, నటి శ్రేయా పటేల్, అంటారియో హెల్త్ అండ్ పవర్ జనరేషన్ బోర్డు సభ్యురాలు అంజు విర్మణి, ఎస్టీఈఎం మైండ్ కార్ప్ వ్యవస్థాపకురాలు అను బిదానీ, స్మార్ట్ వీల్ చైర్స్ స్టార్టప్ బ్రేజ్ మొబిలిటి వ్యవస్థాపకురాలు డాక్టర్ పూజా విశ్వనాథన్, బ్రిటీష్ కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందిన అనన్య ముఖర్జీ రీడ్, టీఈఎల్‌యూఎస్ వ్యవస్థాపకురాలు భన్వీ సచ్‌దేవా, సర్రే హాస్పిటల్స్ ఫౌండేషన్ సీవోవో అజ్రా హుస్సేన్, ప్లాన్ ఇంటర్నేషనల్ కెనడా సూపర్‌వైజర్ లావణ్య హరిహరన్‌లు వున్నారు.ఉమెన్స్ ఎగ్జిక్యూటివ్ నెట్‌వర్క్ గత నెలలో విడుదల చేసిన ఈ జాబితా ప్రకారం కెనడా వ్యాప్తంగా 105 మంది అత్యుత్తమ మహిళలను గుర్తించింది.
పబ్లిక్, ప్రైవేట్, ఎన్జీవో ఇలా 13 రంగాల్లోని మహిళా ప్రముఖులు ఇందులో వున్నారు.