నూతన సాగు చట్టాలను రద్దు చేయాలని కోరుతూ గడిచిన ఏడాది నుంచి ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న పోరాటానికి కేంద్రం ఎట్టకేలకు దిగొచ్చింది.శుక్రవారం జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోడీ.
మూడు సాగు చట్టాలను వెనక్కు తీసుకుంటున్నట్టు ప్రకటించారు.సిక్కులకు అత్యంత పవిత్రమైన రోజున ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు మోదీ వెల్లడించారు.
ఈ నిర్ణయంపై దేశవ్యాప్తంగా రైతులు, రైతు సంఘాలు, రాజకీయ పక్షాలు హర్షం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో యూకే, కెనడాలలోని పంజాబ్ సంతతి ఎంపీలు కూడా ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయాన్ని స్వాగతించారు.
మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రైతుల విజయంగా పంజాబీ ఎన్నారై ఎంపీలు అభివర్ణించారు.ఈ సందర్భంగా యూకే ఎంపీ తన్‌మన్‌జీత్ సింగ్ ధేసీ ట్వీట్ చేస్తూ… వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేయడం ఆనందంగా వుందన్నారు.
ఆందోళన జరిగిన కాలంలో రైతులను తీవ్రవాదులు, వేర్పాటు వాదులుగా ముద్రవేసేందుకు యత్నించాయని.వారికి క్షమాపణ చెప్పాలని తన్‌మన్‌జీత్ కోరారు.
మరో యూకే ఎంపీ ప్రీత్ కౌర్ గిల్ ట్వీట్ చేస్తూ.నల్ల చట్టాలు అని పిలిచే వాటిని రద్దు చేయడం కోసం తీవ్రంగా పోరాడిన సిక్కు రైతులు, భారతీయ రైతు సంఘాలకు దక్కిన భారీ విజయంగా ఆయన అభివర్ణించారు.
యూకే ఎంపీ సీమా మల్హోత్రా ట్వీట్ చేస్తూ.భారత ప్రభుత్వం వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయనుందనే వార్త చాలా సంతోషం కలిగించిందన్నారు.
ఏడాది పాటు జరిగిన నిరసనలు, రైతుల త్యాగాలకు దక్కిన భారీ విజయం ఇది అని ఆమె ట్వీట్‌లో పేర్కొన్నారు.రైతులకు మద్ధతు ఇచ్చిన వారికి, జర్నలిస్టులు, మేధావులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.
ఇక పంజాబీ కెనడియన్ ఎమ్మెల్యే, జాత్యహంకార వ్యతిరేక కార్యక్రమాల పార్లమెంటరీ సెక్రటరీ రచనా సింగ్ సైతం రైతుల నిరసనకు దక్కిన భారీ విజయంగా దీనిని అభివర్ణించారు.
కాగా.భారత ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతులు దాదాపు ఏడాదిగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన నిర్వహించిన సంగతి తెలిసిందే.అన్నదాతలకు మనదేశంతో పాటు అంతర్జాతీయంగానూ మద్ధతు లభించింది.
ముఖ్యంగా యూకే, కెనడియన్ ఎంపీలు, ఎమ్యెల్యేలు ఇతర రాజకీయవేత్తలు రైతుల నిరసనకు అండగా నిలిచారు.ఢిల్లీలో రిపబ్లిక్ డే నాడు రైతుల మార్చ్‌పై నీటి ఫిరంగి, పోలీసు బలగాలను ప్రయోగించడాన్ని సైతం వారు ఖండించారు.
ఉత్తరప్రదేశ్‌లోని లఖీంపూర్ ఖేరీలో ఆందోళన చేస్తున్న రైతులపై కేంద్రమంత్రి కాన్వాయ్ దూసుకెళ్లిన ఘటనలో నలుగురు రైతులు మరణించిన ఘటనను సైతం పంజాబీ సంతతి ఎంపీలు ఖండించారు.