భారత్ అమెరికా సంబంధాలు మరింత ధృడంగా మారుతున్నాయి.ఇండో పసిఫిక్ ప్రాంతంలో మనదేశానికి అమెరికా అత్యంత ప్రాధాన్యతను ఇస్తోంది.
ఇప్పటి వరకు ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం విషయంలో కొన్ని ఇబ్బందులు వున్నాయి.ఈ నేపథ్యంలో ఆ సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించి.
వ్యాపార సంబంధాలను పటిష్టం చేసుకోవాలని ఇరు దేశాలు భావిస్తున్నాయి.ఈ క్రమంలో భారత్ నుంచి రొయ్యలు, బాస్మతీ బియ్యం, బంగారు ఆభరణాలు, ఫర్నీచర్ వంటి 25 రకాల వస్తువులపై ఎగుమతులపై ప్రతిపాదిత 25 శాతం అదనపు సుంకాన్ని అమెరికా ఉపసంహరించుకున్నట్లుగా తెలుస్తోంది.
గతంలో విధించిన డిజిటల్ సేవల పన్ను (డీఎస్‌టీ)పై వివాదాన్ని భారత్ పరిష్కరించిన తర్వాత అమెరికా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా అమెరికా వాణిజ్య ప్రతినిధుల సంస్థ (యూఎస్‌టీఆర్) తెలిపింది.
ఈ వారం యూఎస్‌టీఆర్ కేథరీన్ తాయ్ భారతదేశ పర్యటన తర్వాత బుధవారం ఈ ప్రకటన వెలువడింది.
బహుళజాతి సంస్థలపై పన్ను విధించే అంతర్జాతీయ ఒప్పందం ఆధారంగా భారత్‌తో వివాద పరిష్కారానికి ఒప్పందం కుదిరిందని అమెరికా ట్రెజరీ డిపార్ట్‌మెంట్ బుధవారం తెలిపింది.ఈ అంతర్జాతీయ ఒప్పందానికి 137 దేశాలు అంగీకారం తెలిపాయని వెల్లడించింది.
జూన్‌లో కొన్ని భారతీయ ఎగుమతులపై విధించిన సుంకాలను 180 రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే.దీని ప్రకారం మంగళవారం నుంచి సుంకాలు అమల్లోకి రావాల్సి వుండగా.
వాటిని ఉపసంహరించుకుంటున్నట్లు ట్రెజరీ డిపార్ట్‌మెంట్ పేర్కొంది.
ప్రవాస డిజిటల్ కంపెనీలపై పన్నులు వేయాలని భారత్ కొన్నేళ్లుగా ప్రయత్నిస్తోంది.దీనిలో భాగంగానే ఈక్విలైజేషన్ లెవీని తీసుకొచ్చింది.డిజిటల్ వ్యాపార ప్రకటనలపై దానిని అమలు చేసింది.
మరో దేశంలో ఉండి, భారత్ ఆన్‌లైన్‌లో వ్యాపార లావాదేవీలు నిర్వహించే బహుళజాతి సంస్థల నుంచి కేంద్రం ఈ డిజిటల్ పన్ను వసూలు చేస్తోంది.దీని ప్రకారం రూ.2 కోట్ల టర్నోవర్ వున్న ప్రవాస ఈ కామర్స్ కంపెనీలపై 2 శాతం పన్ను విధించింది.దీంతో గూగుల్, ఫేస్‌బుక్, ట్విటర్ వంటి కంపెనీలు పన్ను భారాన్ని మోయాల్సి వచ్చేది.
దీంతో అమెరికా ప్రభుత్వం ప్రతీకార చర్యలకు దిగింది.భారత్ నుంచి వచ్చే కొన్ని రకాల ఎగుమతులపై 25 శాతం అదనపు పన్నులు విధిస్తామని హెచ్చరించింది.
ఇదే సమయంలో అంతర్జాతీయంగానూ ఒత్తిడి తెచ్చందుకు అంతర్జాతీయ పన్నులపై ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ (ఓఈసీడీ) ఒప్పందాన్ని తెరపైకి తెచ్చింది.దీనినే ‘‘ గ్లోబల్ మినిమమ్ కార్పొరేట్ ట్యాక్స్ రేటు’’ ఒప్పందంగా చెబుతారు.
బహుళ జాతి సంస్థల లాభాలపై కనీసం 15 శాతం పన్ను విధించడం, అంతర్జాతీయ పన్ను వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావడం దీని ప్రధాన లక్ష్యం.ఒకరకంగా బహుళజాతి సంస్థలు పన్ను ఎగ్గొట్టకుండా చూసేందుకు దీన్ని తీసుకొస్తున్నట్లు తెలిపింది.దీనికి భారత్ తొలినాళ్లలో అభ్యంతరం తెలిపినా తర్వాత అంగీకరించింది.దీని ప్రకారం కార్పొరేట్ కనీస పన్ను విధానం అమల్లోకి వస్తే కేంద్ర ప్రభుత్వం ఈ డిజిటల్ పన్నును రద్దు చేయాల్సి ఉంటుంది.
ఎందుకంటే మల్టీలేటరల్ కన్వెన్షన్ (MLC) కోసం డిజిటల్ లేదా ఆ రకమైన పన్నులను అన్ని దేశాలు రద్దు చేయాల్సి ఉంటుందని అమెరికా ప్రతిపాదించిన ఓఈసీడీ చెప్పింది.