సూర్యాపేట జిల్లా:తెలంగాణ రాష్ట్రంలో ఉచిత విద్య,ఉచిత వైద్యం అమలు చేసే వరకు పోరాటం చేస్తామని విశ్రాంత ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి అన్నారు.బుధవారం జిల్లా కేంద్రంలో సోషల్ డెమోక్రటిక్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన ఆయనకు బీసీ విద్యార్థి సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షులు వీరబోయిన లింగయ్య ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాల నాయకులు ఘనంగా స్వాగతం పలికారు.
ముందుగా స్థానిక జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.తెలంగాణ ప్రజల కోసం పదవిని వదిలిన పేదోళ్ల కలెక్టర్ ఆకునూరి మురళిని కలిసేందుకు పేట నాయకులు ఆసక్తి కనబరిచారు.
ఈ సందర్బంగా మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి,సోషల్ డెమోక్రటిక్ ఫోరం నాయకులు డా.సంగంరెడ్డి పృథ్వీరాజ్ లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు చాలా హీనంగా దిగజారిపోయాయని,డబ్బులు,మద్యం పేరుతో రాజకీయాలు కొనసాగుతున్నాయని అవేదన వ్యక్తం చేశారు.ఇటువంటి నీచ రాజకీయాలను తుంగలో తొక్కి నిజమైన రాజకీయాలు చేయడానికి,రాజకీయ వ్యవస్థను మార్చడానికి,ప్రజల జీవితాలలో వెలుగులు నింపడానికి,పేద ప్రజలకు సరైన విద్య,వైద్యం అందించడానికి సోషల్ డెమోక్రటిక్ ఫోరం ద్వారా ప్రజల కోసం,వారి సమస్యలు పరిష్కారమయ్యే వరకు ప్రజలతో కలసి పోరాడడానికి తన ఐఏఎస్ ఉద్యోగం వదిలి,ప్రజా పోరాటలలో పాల్గొనడానికి రావడం జరిగిందని తెలిపారు.పేదోళ్ళకైనా ఉన్నోళ్లకైనా ఒకే విద్య,ఒకే వైద్యం అందే వరకు తమ పోరాటం నిరంతరం కొనసాగుతుందని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం మొత్తం తిరిగి ప్రజలను చైతన్యం చేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో టివివి జిల్లా అధ్యక్షులు గుండాల సందీప్,టీఎస్ఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ భారీ అశోక్,జనసేవాసమితి అధ్యక్షులు తగుళ్ల జనార్దన్ యాదవ్,ఆర్.
వి.ఎస్.పీ రాష్ట్ర అధ్యక్షులు బంటు సందీప్,టిడికే నాయకులు మస్కాపురం ప్రవీణ్,సామాజిక న్యాయవేదిక జిల్లా నాయకులు మర్రిపల్లి సూర్య,జనసమితి పార్టీ జిల్లా అధ్యక్షులు మాండ్ర మల్లయ్య,విద్యార్థులు,పలు ప్రజాసంఘాల నాయకులు,ఆకునూరి మురళి అభిమానులు తదితరులు పాల్గొన్నారు.