సూర్యాపేట జిల్లా: సేద్యానికి అనుకూలంగా లేని దేవాలయ భూములను సొంత ఖర్చులతో అభివృద్ది చేసి,బోర్లు,బావులు ఏర్పాటు చేసుకొని అనాదిగా కౌలు అంతరాయం లేకుండా ఆరుగాలం కష్టపడి సాగు చేస్తున్నామని,కౌలు రేట్లు భారీగా పెంచడంతో అతివృష్టి,అనావృష్టితో పంటలు నష్టపోయి కౌలు భారం భరించలేక పోతున్నామని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయ ( Sri Sitaramachandra Swamy Temple )భూముల కౌలు రైతులు అన్నారు.మంగళవారం వారు మాట్లాడుతూ గతంలో ఎకరానికి కాలువ కింద రూ.4000 మోటర్ కింద రూ.2500వుండేదని,2020 లో అకస్మాత్తుగా కాలువ కింద రూ.5000 మోటర్ కింద రూ.4000 లకు పెంచడం వల్ల అది భారంగా మారిందని,ప్రతీ ఏటా సక్రమంగా కౌలు చెలిస్తున్న తమపై కౌలుభారం తగించి,కౌలు విధానాన్ని వెంటనే సవరించాలని కోరారు.భూమిని నమ్ముకొని బురదలో నుండి బువ్వను తీసే తమను ప్రభుత్వం రైతులుగా గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.నిజమైన సాగుదారులను గుర్తించి సాగులో వస్తున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని కౌలు రైతులకు రైతుబంధు,రైతు బీమా వర్తింజేయాలన్నారు.
ప్రభుత్వం నుండి ఎలాంటి సాయం అందకున్నా నేటి వరకు కౌలు పెండింగ్ పెట్టలేదని,దేవాలయానికి సక్రమంగా కౌలు చెల్లిస్తున్నామన్నారు.కానీ,ఈ కౌలు సవరణ విషయంలో పలుమార్లు దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్, డిప్యూటీ కమిషనరలను కలిసి మొరపెట్టుకున్నా వారు ఎప్పటికప్పుడు దాటవేత ధోరణి అవలంబిస్తూ ఈ సమస్య పరిష్కారానికి చొరవ చూపడం లేదన్నారు.
దేవాలయ భూములను సాగు చేస్తున్న మేము సిట్టింగ్ టేనేన్ సి గా ఎప్పటినుంచో కొనసాగుతున్నామని,ఈ యొక్క భూమి మా సొంత భూమిగా భావిస్తూ వాటిని కాపాడుకుంటూ,అభివృద్ధి చేస్తూ,కరెంటు,బోర్లు,బావులు ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు.వ్యవసాయంలో నష్టం వచ్చినా కౌలు పెండింగ్ పెట్టలేదని,ఈ కౌలు పెంపుదలను సవరిస్తూ పాత పద్ధతిలో కౌలు తీసుకోవాలని కోరారు.
ఇలాగే కొనసాగిస్తే కౌలు భారం పెరిగిపోయి అసలు కట్టలేని పరిస్థితి వస్తుందన్నారు.ఈ కారణంగా కౌలు చెల్లింపు ప్రక్రియ ఆగిపోయి మూడేళ్లు గడుస్తుందని ఇప్పటికైనా ఈ సమస్యపై సత్వర నిర్ణయం తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పలువురు దేవాలయ భూములను కౌలుకు చేస్తున్న రైతులు పాల్గొన్నారు
.