చిరు ధాన్యాలతోనే చిన్నారులకు చక్కని ఆరోగ్యం అందించగలుగుతామని ఐసిడిఎస్ సిడిపిఓ కిరణ్మయి అన్నారు.శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రి వెస్ట్ సైడ్ అంగన్వాడి సెంటర్లో ఏర్పాటు చేసిన పోషణ పక్ష వారోత్సవాల్లో ఆమె పాల్గొని మాట్లాడుతూ కాలం మారిందని,మన తాతముత్తాతలు చిరుధాన్యాలతోనే పదికాలాల పాటు ఆరోగ్యంగా ఉన్నారని వారిలా మనం ఉండాలంటే చిరుధాన్యాలు తీసుకోవాలన్నారు.
నేడు రోజురోజుకు మారుతున్న ఆహార అలవాట్ల ప్రభావం చిన్నారులపై పడుతుందని అన్నారు.చిన్న వయసులోనే షుగర్,బిపి గుండె జబ్బులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
పచ్చి పెసర్లు వేరుశనగ వారానికి రెండుసార్లు తప్పకుండా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదన్నారు.
మినప గుండ్లు తెల్లని వాడవద్దని పొట్టు ఉన్న మినుప గుండ్లను ఒకటికి రెండుసార్లు కడిగి ఉపయోగించాలని అందులోనే పోషక పదార్థాలు అధికంగా ఉంటాయని సూచించారు.
తల్లిదండ్రులు తమ పిల్లల ఆరోగ్య విషయంలో చాలా శ్రద్ధ తీసుకోవాలన్నారు.అంగన్వాడి కేంద్రంలో అందించే పోషకాహారాన్ని ప్రతి తల్లి సద్వినియోగం చేసుకొని మంచి ఆరోగ్యం పొందాలన్నారు.అనంతరం పరిశుభ్రతగా ఉంటూ వయసుకు తగిన బరువు, ఆరోగ్యంగా ఉన్న చిన్నారులను గుర్తించి సర్టిఫికెట్లను అందజేశారు.ఈ కార్యక్రమంలో 27వ వార్డు కౌన్సిలర్ సిరివెళ్ల లక్ష్మీకాంతమ్మ,రిటైర్డ్ టీచర్ కె.వీరభద్రం,సూపర్వైజర్ ఉపేంద్ర,అంగన్వాడి టీచర్లు కుంట్ల సునీత, జీ.శారద,గనీష,సరిత, జ్యోతి,ఆయా రేష్మ, తల్లులు తదితరులు పాల్గొన్నారు.