సూర్యాపేట జిల్లా: ఇతర రాష్ట్రాల నుండి ధాన్యం రాకుండా పటిష్ట చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ అన్నారు.
బుధవారం కోదాడలోని రామాపురం బోర్డర్ చెక్ పోస్ట్ ను జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ తో కలసి ఆకస్మిక తనిఖీ చేసి,చెక్ పోస్ట్ రిజిస్టర్ ను కలెక్టర్ పరిశీలించారు.ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా సరిహద్దుల్లో ఇతర రాష్ట్రాల నుండి జిల్లా లోపలికి ధాన్యం రాకుండా పటిష్ట నిఘా పెంచామని తెలిపారు.
పోలీస్,రెవెన్యూ,వ్యవసాయ మార్కెట్, అలాగే వ్యవసాయ శాఖ సిబ్బందితో 24 గంటలు నిఘా ఉంచామన్నారు.
అన్ని చెక్ పోస్టులలో ఇతర రాష్ట్ర వాహనాల వే బిల్స్, వాహనాల పేపర్స్ తనిఖీలు చేసి ధాన్యం లోడ్ తో ఉన్న వాహనాలు తిరిగి పంపించాలని సిబ్బందిని ఆదేశించారు.
ధాన్యం పండించిన రైతులు ఎక్కడ కూడా అధైర్య పడొద్దని ప్రతి గింజను కొనుగోలు చేస్తామని తెలుపుతూ ఇప్పటికే అన్ని కేంద్రాలలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని వేగంగా మిల్లులలో దిగుమతి చేయించడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో కోదాడ ఆర్డీవో కిషోర్ కుమార్, డిఎస్పీ జి.వెంకటేశ్వర రెడ్డి,తహసీల్దార్ శర్మ, ఇతర శాఖల అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.