సూర్యాపేట జిల్లా:రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కేవలం బీఆర్ఎస్ పార్టీ( BRS ) నేతలకు, కార్యకర్తలకే ఇవ్వడం సరియైన పద్ధతి కాదని అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు తమ వైఖరి మార్చుకోవాలని, లేనియెడల రానున్న ఎన్నికల్లో శంకరగిరి మాన్యాలు పట్టడం ఖాయమని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి( Mallu Lakshmi ) అన్నారు.సోమవారం సిపిఎం సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ,అధికార పార్టీ కార్యకర్తలకే ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ కలెక్టరేట్ ముందు నిర్వహించిన భారీ ధర్నానుద్దేశించి ఆమె మాట్లాడుతూ సంక్షేమ పథకాలు బీఆర్ఎస్ కార్యకర్తలకు ఇస్తుంటే, అర్హులైన బడుగు వర్గాలకు అందకుండా అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.
గతంలో పరిపాలించిన కాంగ్రెస్, టిడిపి పార్టీలు తమ పార్టీకి చెందిన వారితో పాటు అర్హులకు సంక్షేమ పథకాలు ఇచ్చారని,నేడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ మొత్తం సొంత పార్టీ కార్యకర్తలకు ఇవ్వడం ఇంతకన్నా దారుణమన్నారు.పార్టీలో చేరిన వారికి మాత్రమే సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పడం సిగ్గు చేటన్నారు.
ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయల్లోలబ్ధిదారుల జాబితా రెడీ కావడం దుర్మార్గమన్నారు.అధికారులు అర్హులైన వారిని గుర్తించినా,అధికార పార్టీ నాయకుల ఒత్తిడికి తలోగ్గి అధికార పార్టీ నాయకుల అడుగులకు మడుగులొత్తుతున్నారని ఆరోపించారు.
అర్హులైన పేదలకు దక్కాల్సిన సంక్షేమ పథకాలను దొడ్డి దారిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఇచ్చే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు.
ఇప్పటికైనా ఎమ్మెల్యేలు వైఖరి మార్చుకోకపోతే ప్రజాగ్రహానికి గురికాక తప్పదన్నారు.
బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై దళిత,బీసీ,మైనార్టీ పేదలందరినీ కలుపుకొని,అఖిలపక్ష పార్టీలతో బీఆర్ఎస్ పార్టీ గద్దె దిగేంత వరకు ఆందోళన కార్యక్రమాలు చేపట్టి,ప్రభుత్వానికి కనువిప్పు కలిగే విధంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, హెచ్చరించారు.కలెక్టరేట్ లోకి చొచ్చుకపోయిన సిపిఎం కార్యకర్తలు అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు ఇవ్వాలని నినాదాలు చేస్తూ సిపిఎం నాయకులు,కార్యకర్తలు కలెక్టరేట్ లోకి చొచ్చుకు పోయేందుకు ప్రయత్నించారు.
ఈ సందర్భంగా మెయిన్ గేటు వద్ద పోలీసులకు, సిపిఎం కార్యకర్తలకు మధ్య తీవ్ర తోపులాట, వాగ్వాదం జరగడంతో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి.అనంతరం ముఖ్యమైన నాయకులను కలెక్టరేట్లోకి అనుమతించడంతో గొడవ సద్దుమణిగింది.
వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ వెంకట్రావుకు సమర్పించారు.ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి( Mallu Nagarjuna Reddy ),జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు సీపీఎం నాయకులు, కార్యకర్తలు,అర్హులైన పేదలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.