సూర్యాపేట జిల్లా:మునుగోడు ఉప ఎన్నిక పరిణామాలు,ఫామ్ హౌస్ వ్యవహారంలో బీజేపీ వైఖరిపై మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు.శుక్రవారం జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒక వ్యక్తి స్వార్ధం,ఒక పార్టీ కుట్రతో మునుగోడు ఉపఎన్నిక వచ్చిందన్నారు.
అయినా ప్రజల తీర్పు న్యాయం వైపేనని స్పష్టంగా తెలుస్తుందని, మూడు నెలలుగా కష్టపడి పార్టీ కోసం పని చేసిన నేతలకు, కార్యకర్తలకు,సహకరించిన మీడియాకు కృతజ్ఞతలు తెలిపారు.తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునెందుకు ఉప ఎన్నిక తెచ్చారని, రేపటి విజయం తెలంగాణ అభివృద్ధికి,దేశంలోని ప్రజాస్వామ్య శక్తుల ఐక్యతకు పునాది వేస్తుందన్నారు.
కేంద్ర ప్రభుత్వం చేయలేని అభివృద్ధిని చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలను అణిచి వేయడానికి బీజేపీ కుట్ర చేస్తుందని,బీజేపీ ఎన్ని కుట్రలు,కుతంత్రాలు చేసినా, ఐటీ,ఈడీ అన్ని రాజ్యాంగ సంస్థలను ఉపయోగించినా మునుగోడు ప్రజల స్ఫూర్తిని ఆపలేకపోయిందని అన్నారు.మునుగోడులో బీజేపీకి చెంపపెట్టు ఫలితం రాబోతుందని,బీజేపీ ఏం మాట్లాడినా ప్రజలు వాళ్ళని పట్టించుకునే పరిస్థితిలేదన్నారు.
ఫార్మ్ హౌస్ వ్యవహారంలో దొరికిన దొంగల బండారం ప్రజల ముందు ఉంచామని,దొరికిన దొంగలను తప్పించే ప్రయత్నం బీజేపీ చేస్తుందని ఆరోపించారు.దొరికిన వారు నకిలీ ముఠా అయితే ఒరిజినల్ దొంగలు ఎవరో బండి చెప్పాలని డిమాండ్ చేశారు.
వేషాలు వేసి తాము తీసుకొస్తే అసలు దొంగలను మీరు బయటపెట్టాలని,తప్పించుకునే ప్రయత్నంలో బీజేపీ డొంకతిరుగుడు సమాధానాలు చెబుతున్న విధానం ప్రజలకు అర్థమైందన్నారు.దొరికిన వారు ఒరిజినల్ కానప్పుడు నందకుమార్ భార్య కేసు ఎందుకు వేసిందో చెప్పాలన్నారు.