సూర్యాపేట జిల్లా:అంతా నా ఇష్టం ఎడా పెడా ఏం చేసినా అడిగేదెవర్రా? నా ఇష్టం,అంతా నా ఇష్టం అంటుండు ఓ సర్పంచ్ సాబ్.అసలు సంగతేంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ గ్రామ పంచాయతీకి అభివృద్ధి పనుల నిమిత్తం,పల్లె ప్రకృతి వనాలకు నీటి సరఫరా చేసేందుకు ట్రాక్టర్ ను అందజేసిన విషయం తెలిసిందే.
ఆ ట్రాక్టర్ ను గ్రామ పంచాయతీ పనుల కోసం వాడుకోవాలనే రూల్ కూడా పెట్టింది.కానీ,రూలా రోకలి బండా అంటూ రాష్ట్రంలో అక్కడక్కడా కొందరు ప్రజా ప్రతినిధులు వాటిని తమ సొంత అవసరాలకు, బంధువులకు,పార్టీ నేతలకు సాయం చేస్తున్న ఘటనలు వెలుగుచుస్తూనే ఉన్నాయి.
ఇప్పుడు ఇక్కడ కూడా అదే సీన్ జరగడం,అది కాస్తా స్థానిక బీజేపీ నాయకుల కంటిలో పడడంతో విషయం కాస్తా పంచాయితీగా మారింది.రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ పనుల కోసం ఇచ్చిన ట్రాక్టర్ ను అట్లెట్లా సొంత అవసరాలకు వాడుకుంటావని బీజేపీ నాయకులు అడ్డం తిరిగి లొల్లి చేసి నిరసన తెలిపడంతో ఆ సర్పంచ్ పని తనం కాస్తా సూర్యాపేట జిల్లాలో వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే ఆదివారం సూర్యాపేట రూరల్ మండలం కేసారం సర్పంచ్ మెంతబోయిన నాగయ్య రూప్ల తండాలో ఉన్న తన పొలంలోని వడ్లను గ్రామ పంచాయతీ ట్రాక్టర్ తో కేసారానికి తరలిస్తున్నాడు.అంతే కాదు ఆ పనికి ఏకంగా గ్రామ పంచాయతీ సిబ్బందినే రంగంలోకి దించాడు.
ఈవిషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు అక్కడికి చేరుకొని కాసారానికి వస్తున్న ట్రాక్టర్ ను మార్గ మధ్యలో అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ను తన సొంత అవసరాలకు ఉపయోగిస్తున్న సర్పంచ్ నాగయ్యపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అధికారం చేతిలో ఉంటే చాలు గ్రామ సర్పంచ్ అయినా రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా,దేశ ప్రధానమంత్రి అయినా ఆడిందే ఆట,పాడిందే పాట అనడానికి ఇలాంటి చిత్రాలు లెక్కలేనన్ని చూడాల్సి వస్తుందని అంటున్నారు అన్ని వ్యవస్థలు సక్రమంగా,సజావుగా సాగాలని కోరుకునే సామాజిక కార్యకర్తలు.