సూర్యాపేట జిల్లా: కరెంట్ అంటేనే అత్యంత ప్రమాదకరం.అందులో హై టెన్షన్ పవర్ లైన్ అంటే మరీ దారుణంగా ఉంటుంది.
ఎలాంటి 11కేవి విద్యుత్ లైన్ ప్రజలు నివాసముంటున్న ఇళ్లపై నుండి వెళుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతుంటే సంబంధిత అధికారులు కనీసం ఆ వంక తిరిగి చూసిన పాపాన పోలేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ గ్రామంలో ఆందోళనకు దిగిన ఘటన సూర్యాపేట జిల్లా( Suryapet District ) నడిగూడెం మండలం రత్నవరం గ్రామం( Ratnavaram )లో బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.రాష్ట్రం మారింది, పాలకులు మారారు, అధికారులు కూడా మారారు కానీ,ఏళ్ల తరబడి ఇళ్లపై నుండి 11కేవి విద్యుత్ తీగల పోతున్నా నేటికీ మా బతుకులు మారలేదని గ్రామస్తులు వాపోయారు.
గ్రామంలో ఇళ్లపై నుండి వెళుతున్న 11 కేవి విద్యుత్ తీగలను తొలగించాలని ఎన్నిసార్లు, ఎంతమందితో మొరపెట్టుకున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు.ఇద్దరు చిన్నారులకు విద్యుత్ షాక్ తగలడంతో ప్రమాదం బారిన పడ్డారని పలుమార్లు పశువులకు షాక్ తగిలి మృత్యువాత పడ్డాయని,విద్యుత్ తీగల వలన పక్కనే ఉన్న పంట పొలాల్లో మంటలు చెలరేగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రమాదకర విద్యుత్ తీగలను ఇళ్లపై నుండి తొలగించి ప్రమాదాల భారీ నుండి మమ్ములను కాపాడాలని వేడుకున్నారు.ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి రత్నవరం గ్రామ ప్రజల సమస్యకు పరిష్కారం చూపుతారా లేదా వేచి చూడాలి…!!
.