పాట్నా: బీహార్ రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి.దీంతో వివిధ రాజకీయ పార్టీలు అభ్యర్థుల వేటలో తలమునకలై ఉన్నాయి.
ఇక్కడ ఆ పార్టీ ఈ పార్టీ అన్న తేడా లేకుండా అన్ని పార్టీలు కనీస అర్హత అయిన నేర చరిత్రను దృష్టిలో ఉంచుకొనే టిక్కెట్లు కేటాయిస్తున్నాయి.అయితే అధికార జేడీయూ మాత్రం ఓ అడుగు ముందుకేసి, దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ముజఫర్‌పూర్ షెల్టర్ హోం కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి మంజూవర్మకు టికెట్ కేటాయించి సంచలన నిర్ణయం తీసుకుంది.
దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన ఈ కేసులో 30 మంది బాలికలపై లైంగిక దాడులు జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి.ఈ కేసుకు సంబంధించి నాడు మంత్రి పదవిలో ఉన్న మంజు వర్మ, ఆమె భర్త చంద్రశేఖర్ ఆరోపణలు ఎదుర్కొన్నారు.
దీంతో మంజు వర్మ తన మంత్రి పదవిని కూడా కోల్పోవాల్సి వచ్చింది.
ఈ భార్యా భర్తలిద్దరూ కోర్టులో లొంగిపోయి ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు.
ఆమె ఇప్పుడు బెగుసరై సమీపంలోని బర్యార్‌పూర్ అసెంబ్లీ నియోజవర్గం నుంచి బరిలో దిగుతున్నారు.అలాగే ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ చిన్న కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ కు స్వయానా మామ అయిన చంద్రికా రాయ్‌కు సైతం జేడీయూ టికెట్ ఇచ్చింది.
అతనిపై కూడా తీవ్ర నేరారోపణలు ఉన్నాయి.అతను ప్రస్తుతం పర్సా నియోజకవర్గం నుంచి బరిలో దిగుతున్నారు.