మారుతున్న కాల మాన పరిస్ధితులకు అనుగుణంగా ఆధునిక యుద్ధ తంత్రం మారిపోయింది.గతంలో మాదిరిగా నేల మీద ట్యాంకులు, నీటిలో సబ్ మెరైన్‌లు, గాలిలో యుద్ధ విమానాలతో వార్ చేస్తే విజయం సాధించడం కష్టమే.
ఇప్పుడు యుద్ధ రంగంలో కొత్తగా వినిపిస్తున్న పేరు ‘‘హైపర్ సోనిక్’’ టెక్నాలజీ.ఈ విషయంలో చైనా మరింత దూకుడు ప్రదర్శిస్తోంది.
ఈ ఏడాది ఆగస్టులో తొలిసారి అణు సామర్థ్యం కలిగిన ఓ హైపర్సోనిక్ మిసైల్ పరీక్షను చైనా మిలటరీ చేపట్టినట్లు బ్రిటన్కు చెందిన వార్తాపత్రిక “ఎన్హెచ్కే వరల్డ్” ప్రకటించడంతో ప్రపంచం ఉలిక్కిపడింది.
క్షిపణి లక్ష్యానికి 32 కిమీ దూరంలో వెళ్లిందని.
ప్రయోగం విజయవంతం కాకున్నా.హైపర్సోనిక్ మిసైల్ టెక్నాలజీపై చైనా పురోగతి అమెరికా ఇంటెలిజెన్స్ ను షాక్కు గురి చేసిందని తెలిపింది.
ధ్వని కంటే ఐదు రెట్లు వేగంగా ప్రయాణించగల ఈ మిస్సైల్ను చైనా కనుక పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తే అమెరికా, జపాన్ క్షిపణి రక్షణ వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని నిపుణులు అంటున్నారు.సాంప్రదాయ సైనిక సంపత్తిని తగ్గించుకుంటున్న చైనా.
అణ్వాయుధాలు, రాకెట్ ఫోర్స్‌పై ఎక్కువగా దృష్టి సారించింది.ఒక్క 2020లోనే 250 బాలిస్టిక్ క్షిపణీ పరీక్షలు నిర్వహించింది.
దీంతో అగ్రరాజ్యం అమెరికా అప్రతమత్తమైంది.చైనాను కట్టడి చేయకుంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వుంటుందని భావిస్తోంది.అమెరికాలోని క్షిపణి రక్షణ వ్యవస్థ ఉత్తర ధ్రువం వైపు నుంచి వచ్చే ముప్పులను ఎదుర్కోవడానికి సదా సిద్ధంగా వుంటుంది.అయితే చైనా పరీక్షించిన కొత్త ఆయుధంతో రాడార్లకు అందనంత ఎత్తులో దిశలను మార్చుకుంటూ దక్షిణ ధ్రువం వైపు నుంచీ దాడి జరిగే అవకాశం వుంది.
ఫలితంగా పెద్దన్నలో కంగారు మొదలైంది.ఇప్పటిదాకా భూమి, సముద్ర గర్భం, గగనతలం నుంచి మాత్రమే అణ్వాయుధాలను ప్రయోగించే అవకాశం వుండగా.
ఇప్పుడు అంతరిక్షం నుంచి కూడా న్యూక్లియర్ వార్ హెడ్‌లను ప్రయోగించగల సత్తా చైనాకు దక్కినట్లయ్యింది.
ఈ నేపథ్యంలోనే యూఎస్ స్పేస్ కౌన్సిల్‌కు అధిపతిగా వున్న కమలా హారిస్ రంగంలోకి దిగారు.హైపర్ సోనిక్ టెక్నాలజీ విషయంలో చైనాకు చెక్ పెట్టాలని ఆమె భావిస్తున్నారు.హైపర్ సోనిక్ ఆయుధ దాడుల నుంచి అమెరికాను రక్షించగలిగే క్షిపణి వ్యవస్థను అభివృద్ధి చేయడానికి నార్త్‌రోప్ గ్రమ్మన్, లాక్‌హీడ్ మార్టిన్, రేథియాన్‌లను ఎంపిక చేసినట్లు పెంటగాన్ గత వారం ప్రకటించిన సంగతి తెలిసిందే.
గ్లైడ్ ఫేజ్ ఇంటర్‌సెప్టర్‌ను అభివృద్ధి చేయడానికి గాను మూడు కంపెనీలకు వేరు వేరుగా 60 మిలియన్ డాలర్ల కాంట్రాక్ట్‌లు ఇచ్చింది.ఇదే సమయంలో నేషనల్ స్పేస్ కౌన్సిల్ మొదటి సమావేశాన్ని డిసెంబర్ 1న ఏర్పాటు చేశారు కమలా హారిస్.
ఈ భేటీలో ఆమె కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం వుంది.