ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెటీరియల్ సైంటిస్ట్, ఇంజనీర్, ఆవిష్కర్త, ఐఐటీ కాన్పూర్ పూర్వ విద్యార్ధి డాక్టర్ వీణా సహజ్‌వాలాకు ఆస్ట్రేలియాలో అరుదైన గౌరవం దక్కింది.2022వ సంవత్సరానికి గాను న్యూసౌత్‌వేల్స్ ‘‘ ఆస్ట్రేలియన్ ఆఫ్ ది ఇయర్’’ గా వీణా ఎంపికయ్యారు.మంగళవారం న్యూసౌత్‌వేల్స్ గవర్నర్ మార్గరెట్ బీజ్లీ సమక్షంలో .ఆ రాష్ట్ర ప్రీమియర్ డొమినిక్ పెరోటెట్ వీణా సహజ్‌వాలాకు అవార్డును అందజేశారు.రీసైక్లింగ్ సైన్స్‌లో విప్లవాత్మక మార్పులు తెచ్చిన సహజ్‌వాలా.సిడ్నీలోని యూనివర్సిటీ ఆఫ్ న్యూసౌత్‌వేల్స్‌లో మెటీరియల్ సైన్స్ ఫ్యాకల్టీలో ప్రొఫెసర్‌గా వ్యవహరిస్తున్నారు.
వీణా సిడ్నీలోని సెంటర్ ఫర్ సస్టైనబుల్ మెటీరియల్స్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీ (ఎస్ఎంఏఆర్టీ) వ్యవస్ధాపక డైరెక్టర్‌గా కూడా పనిచేశారు.ఆమె ఆధ్వర్యంలో యూనివర్సిటీ .2018లో ల్యాండ్‌ఫిల్‌లోకి భారీగా వెళ్లే ఎలక్ట్రానిక్ వ్యర్థాలను తగ్గించేందుకు గాను ప్రపంచంలోనే మొట్టమొదటి ఈ- వేస్ట్ మైక్రోఫ్యాక్టరీని ప్రారంభించింది.స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు వంటి ఎలక్ట్రానిక్ వ్యర్ధ పదార్ధాల నుంచి పలు భాగాలను తిరిగి ఉపయోగించడంపై మైక్రోఫ్యాక్టరీ దృష్టి సారించింది.
ఇందులో డాక్టర్ సహజ్‌వాలా చేసిన కృషి మరువలేనిది.
భారత్‌లోని ముంబైలో జన్మించిన వీణ.ఆస్ట్రేలియాలో స్థిరపడకముందు కెనడాలోని వాంకోవర్‌లో మాస్టర్స్ డిగ్రీ చదివారు.కెనడాలో చదువుకుంటున్న సమయంలోనే రామ మహాపాత్రతో ప్రేమలో పడి ఆయనను వివాహం చేసుకుంది.1989 నుంచి మెటీరియల్ ఇంజనీరింగ్‌పై పలు పత్రాలను ఆమె ప్రచురిస్తున్నారు.వ్యర్ధాలు లేని ఆర్ధిక వ్యవస్థను నిర్మించడంలో వీణా సహజ్‌వాలా చేసిన కృషికి ఆమెకు ఎంతో గుర్తింపు దక్కింది.
ఉక్కు ఉత్పత్తి పరిశ్రమలో బొగ్గును ఉపయోగించేందుకు పరిశుభ్రమైన ప్రత్యామ్నాయాన్ని కనుగొనడం వీటిలో ఒకటి.వీణ సృష్టించిన ప్రక్రియకు పాలిమర్ ఇంజెక్షన్ టెక్నాలజీ అని పేరు పెట్టారు.దీనిని గ్రీన్ స్టీల్ అని కూడా వ్యవహరిస్తారు.గ్రీన్ స్టీల్ టెక్నాలజీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ స్టీల్ తయారీ కార్యకలాపాలలో వినియోగిస్తున్నారు.
ఈ ఆవిష్కరణ తక్కువ ఉద్గార ఉక్కు తయారీలో ఆస్ట్రేలియాను అగ్రగామిగా నిలిపింది.
ఈ గ్రీన్ స్టీల్ ఉద్యమం సహజ్‌వాలాకు అనేక అవార్డులు, గ్రాంట్‌లను సంపాదించి పెట్టింది.ఇవి పర్యావరణ పరిశోధనను కొనసాగించడంలో ఆమెకు ఎంతగానో సహయపడ్డాయి.గ్రీన్ స్టీల్ ప్రక్రియకు 2012లో యూఎస్ సొసైటీ ఫర్ మాన్యుఫ్యాక్చరింగ్ ఇంజనీర్స్ అరుదైన ఆవిష్కరణగా గుర్తించింది.
అదే ఏడాది ఆస్ట్రేలియన్ ఇన్నోవేషన్ ఛాలెంజ్‌ని కూడా గెలుచుకుంది.గ్రీన్ స్టీల్ టెక్నాలజీలో వీణా సహజ్‌వాలా చేసిన కృషికి గాను 2019లో బిజినెస్ హయ్యర్ ఎడ్యుకేషన్ రౌండ్ టేబుల్ అవార్డును కూడా అందుకున్నారు.