నల్లగొండ జిల్లా:నకిరేకల్ లో అధికార పార్టీ నేతల మధ్య ఆధిపత్య పోరు ముదిరి పాకాన పడింది.ఇప్పటి వరకు అనుచరుల మధ్య సాగిన సమరం, నేతల మూతులను తాకడంతో కారు చిచ్చు రచ్చకెక్కింది.దీనితో టీఆర్ఎస్ శ్రేణుల్లో అయోమయం నెలకొంది.2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇద్దరి మధ్య నెలకొన్న ఆధిపత్య పోరాటం నాలుగేళ్లుగా చాపకింద నీరులా ఉండేది.కానీ,ఎన్నికల సమయం సమీపిస్తున్న తరుణంలో ఒక్కసారిగా బయటికి తన్నుకొస్తోంది.రాబోయే ఎన్నికల్లో నకిరేకల్ టిక్కెట్ తనకంటే తనకని సన్నిహితుల వద్ద చెప్పుకుంటూ వస్తున్న ఇద్దరి నేతలు పీకే ఎంట్రీతో అప్రమత్తయ్యారని తెలుస్తోంది.
ఈ సారి చాలామంది సిట్టింగ్లకు టిక్కెట్లు దక్కవని పీకే రిపోర్ట్ ఇచ్చినట్లుగా ప్రచారం జరగడం, ఖమ్మం పర్యటనలో కేటీఆర్ కూడా పీకే రిపోర్ట్ ప్రకారమే టిక్కెట్లు ఇస్తామని చెప్పడంతో ఆ సెగ నకిరేకల్ కు తగిలినట్లుగా అనిపిస్తుంది.ఇక మౌనంగా ఉంటే కుదరని భావించిన ఇద్దరు నేతలు స్పీడ్ పెంచినట్లుగా అర్ధమవుతుంది.
అందులో భాగంగానే మంగళవారం జరిగిన ఓ మీటింగ్ లో ప్రస్తుత ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తన మాటల దాడిని షురూ చేశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.ఈ మీటింగ్ లో మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశంపై ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య చేసిన కామెంట్స్ నియోజకవర్గ రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి.
చిరుమర్తి ఎమన్నారు?భూవివాదాల్లో జోక్యం చేసుకుంటున్నానని వీరేశం నాపై దుష్ప్రచారం చేస్తున్నాడు.నేను ఏ భూముల పంచాయతీలో వేలు పెట్టను,కానీ,ఒకరి భూములు లాక్కొని,ఇంకొకరికి కట్టబెట్టిన చరిత్ర వీరేశం కున్నదని ఆరోపించారు.
పీకే సర్వే ఆధారంగా తనకే టికెట్ అంటూ వీరేశం తన అనుచరులతో అసత్య ప్రచారం చేసుకుంటున్నాడు.అసలు మూడేళ్ళుగా టీఆర్ఎస్ పార్టీలో వీరేశంకు సభ్యత్వం కూడా లేదు.
ఇక టిక్కెట్ ఎలా ఇస్తారని ఎద్దేవా చేశారు.రూ.20 వేలకు దొరికే డాక్టరేట్ పట్టాను పట్టుకుని నియోజకవర్గంలో హడావిడి చేయడం,తనను దూషించడం విడ్డూరంగా ఉందన్నారు.కిరాయి వ్యక్తులను ఉసిగొల్పి తనను అడ్డుకునే కార్యక్రమాలు చేస్తున్నాడని,అది సాధ్యం కాదని అన్నారు.
వీరేశంను ఆయన అనుచరులను నకిరేకల్ జనం నమ్మేపరిస్థితిలో లేరని,ఎవరెన్ని కుట్రలు చేసినా టికెట్ నాదే గెలుపూ నాదేనని ధీమా వ్యక్తం చేశారు.ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య బహిరంగంగా మాజీ ఎమ్మెల్యే వీరేశంపై ప్రత్యక్ష ఆరోపణలు చేయడంతో పార్టీలో ఎప్పుడు ఏం జరుగుతుందోనని గులాబీ శ్రేణుల్లో గుబులు మొదలైంది.