స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు విజయవాడ ఏసీబీ కోర్టు రెండు రోజులపాటు సీఐడీ కస్టడీకి అనుమతినిచ్చింది.ఈ మేరకు కస్టడీ పిటిషన్ పై సుదీర్ఘ వాదనలు విన్న ధర్మాసనం కస్టడీకి ఇస్తూ ఆదేశాలు ఇచ్చింది.
అయితే కేసులో భాగంగా చంద్రబాబును ఐదు రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ఏపీ సీఐడీ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.ఈ రెండు రోజులపాటు చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే విచారించేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది.
విచారణ సమయంలోని ఫొటోలు, వీడియోలు విడుదల చేయకూడదని ఆదేశించింది.అదేవిధంగా చంద్రబాబును విచారించే అధికారుల జాబితా కోర్టుకు అందజేయాలని తెలిపింది.
అనంతరం కస్టడీ విచారణ నివేదికను సీల్డ్ కవర్ లో కోర్టుకు అందించాలని ఆదేశాలు జారీ చేసింది.న్యాయవాదుల సమక్షంలో విచారణ జరగాలని న్యాయమూర్తి వెల్లడించారు.
అంతేకాకుండా చంద్రబాబు ఆరోగ్యం, వయసు దృష్ట్యా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్న కోర్టు కస్టడీ ముగిసిన అనంతరం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి ఎదుట హాజరు పరచాలని ఆదేశాలు జారీ చేసారు.విచారణ అంశాలను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తామని కోర్టు తెలిపింది.ఈ మేరకు ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించనున్నారు.