సూర్యాపేట జిల్లా: నేరేడుచర్ల మండల ( Neredcherla mandal )కేంద్రం నుండి జానలదిన్నె, వైకుంఠపురం వెళ్లే రోడ్డుకు ఇరువైపులా కంపచెట్లు ఏపుగా పెరిగి అడవిని తలపిస్తోందని,మూల మలుపు వద్ద ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక,కనీసం ప్రమాద సూచిక బోర్డుకు కూడా లేకపోవడంతో వాహనాన్ని తప్పించే ప్రయత్నంలో సైడ్ మార్జిన్ లోకి వెళ్దామన్నా మార్జిన్ లో దట్టమైన చెట్లు పెరగడంతో వాహనాలు ఢీకొనే పరిస్థితులు నెలకొని ఈ రోడ్డు ప్రమాదకరంగా మారిందని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దీనికి తోడు రోడ్డుపై అక్కడక్కడా పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి,వర్షం నీటితో నిండడంతో ఏ ప్రమాదం ఎప్పుడు జరగుతుందో తెలియని స్థితిలో భయంగా ప్రయాణం చేయల్సిన పరిస్థితి ఏర్పడిందని,ఇక రాత్రి పూట అయితే మరీ దారుణంగా ఉందని వాపోతున్నారు.
ఈ రోడ్డుపై వ్యవసాయ పనుల నిమిత్తం రాత్రి పగలు తేడా లేకుండా రైతులు వెళ్తుంటారని,రాత్రిపూట వెళ్లే రైతులు( Farmers ) సైడ్ మార్జిన్ లో వెళ్ళలేక రోడ్డుపై వెళ్తుంటే వాహనాల రద్దీతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని,ఈ రోడ్డు గురించి ప్రజాప్రతినిధులకు,అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఆలకించే నాథుడే కరువయ్యాడని ఆరోపిస్తున్నారు.
ప్రమాదకరంగా మారిన రోడ్డుపై ప్రజలకు ఎలాంటి అనర్ధాలు జరగకముందే సంబంధిత అధికారులు స్పందించి రోడ్డుకు ఇరువైపులా పెరిగిన చెట్లను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.
పొలాల వద్దకు వెళ్లాలంటే భయంగా ఉందని రైతు కేశగాని సైదులు( Saidulu ) అన్నారు.జానలదిన్నె రోడ్డులో రోడ్డు పక్కన చెట్లు విపరీతంగా పెరిగాయి.ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక రాత్రిపూట రైతుల పొలాల వద్దకు వెళ్లాలంటే భయంగా ఉంది.తక్షణమే వాటిని తొలగించి ప్రజలకు,రైతులకు, ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూడాలంటున్నరు.