సూర్యాపేట జిల్లా: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ను సవరించి విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించి,జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని పి.డి.
ఎస్.యు, పివైఎల్ జిల్లా నాయకులు పులుసు సింహాద్రి,నల్గొండ నాగయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.శనివారం ఆత్మకూర్ (ఎస్) మండల కేంద్రంలో నిర్వహించిన ధర్నాలో వారు మాట్లాడుతూ విద్యా,నిరుద్యోగ అంశాలను గాలికొదిలేసి కాంగ్రెస్ సర్కార్ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో 2024-25 వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టిందన్నారు.రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ పై నిరుద్యోగులు,విద్యార్థులు గంపెడంతా ఆశలు పెట్టుకున్నారని,కానీ,రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన బడ్జెట్ ను చూస్తే ఉసూరుమనేలా ఉందన్నారు.
మొత్తం తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2,91,159 కోట్లు కాగా దీనిలో కేవలం 21,292 కోట్లు విద్యారంగానికి కేటాయించారు.వీరు కేటాయించిన బడ్జెట్ ఏ మూలకు సరిపోవని, ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల, కళాశాల, యూనివర్సిటీలలో మౌలిక సదుపాయాలు లేక వెంటిలేషన్ పై ఉన్నాయన్నారు.
ప్రభుత్వ విద్యారంగ బలోపేతం కోసం ప్రత్యేకమైన గ్రాంట్లు విడుదల చేయాల్సిన అవసరం ఉందన్నారు.విద్యార్థులకు ఇవ్వవలసిన సుమారు 8000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్స్ స్కాలర్షిప్స్ ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర ఎలాంటి ప్రణాళికలు లేవన్నారు.
ప్రభుత్వ విద్యాసంస్థలను నిర్వీర్యం చేసి ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలకు రెడ్ కార్పెట్ పరచడం, ఫీజుల దోపిడీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చే విధంగా వీరి బడ్జెట్ ఉందన్నారు.బడ్జెట్ లో నూతన విద్యాసంస్థల ప్రస్తావన లేదని,ఎన్నికల్లో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి బడ్జెట్ ను కేటాయించలేదన్నారు.
కాంగ్రెస్ సర్కార్ ఎన్నికల్లో విద్యార్థులకు, నిరుద్యోగులకు అనేక హామీలు ఇచ్చిందని,ఆ హామీలను అమలు చేయాలంటే ఈ బడ్జెట్ ఏ మాత్రం సరిపోదన్నారు.
కాంగ్రెస్ సర్కార్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ను సవరించి విద్యారంగానికి కనీసం 30% నిధులను కేటాయించాలని, నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి జాబ్ క్యాలెండర్ ను విడుదల చేసి స్పష్టమైన విధివిధానాలను తయారు చేయాలని డిమాండ్ చేశారు.
లేనియేడల ఈ నెల 31న వేలాదిమంది విద్యార్థి,యువకులతో కలిసి అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పి.డి.ఎస్.యు డివిజన్ అధ్యక్షకార్యదర్శులు, జలగం సుమంత్, పిడమర్తి భరత్,పివైఎల్ జిల్లా కోశాధికారి బండి రవి,పీఓడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి కంచర్ల నరసమ్మ,కాలేజ్ విద్యార్థులు,తదితరులు పాల్గొన్నారు.