సూర్యాపేట జిల్లా:రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల ఆర్థిక ప్రగతి పెంచేందుకు చేపట్టిన బృహత్తర ప్రజాపాలన కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పక్కా ప్రణాళిక రూపొందించాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు( S Venkata rao ) అధికారులను ఆదేశించారు.
ఆదివారం రాత్రి వెబ్ ఎక్స్ ద్వారా కాన్ఫరెన్స్ నిర్వహించారు ప్రజాపాలన కార్యక్రమం అమలుకు రూపొందించవలసిన ప్రణాళికపై సంబంధిత అధికారులతో కలెక్టర్ జిల్లా అదనపు కలెక్టర్లు సిహెచ్.ప్రియాంక,ఏ వెంకట్ రెడ్డి లతో కలిసి సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 28 నుండి జనవరి 6 వరకు చేపట్టనున్న ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రజల చెంతకు తీసుకువెళ్లేందుకు పక్కా ప్రణాళిక రూపొందించాలని అధికారులకు సూచించారు.ముందుగా చిన్న గ్రామాలను తీసుకోవాలని,ప్రతి కుటుంబానికి దరఖాస్తు అందేలా రోజుకు రెండు గ్రామాలు చొప్పున ప్రతి గ్రామపంచాయతీలోనూ సమావేశాలు ఏర్పాటు చేయాలని సూచిస్తూ ప్రతి పంచాయతీలోనూ వారం వరకు దరఖాస్తులు తీసుకుంటామని ప్రజలకు తెలియచెప్పాలన్నారు.
తాహశీల్దార్లు,ఎంపీడీవోలు ఎంపిఓలు,ఎంఈఓలు, డిప్యూటీ తాహశీల్దారులు టీములు ఏర్పాటు చేసుకోవాలని,కుటుంబ జనాభా వారీగా చిన్న జీపీలో 4 కౌంటర్స్ ఏర్పాటు చేయాలన్నారు.28,29 తేదీలలో చిన్న గ్రామపంచాయతీలు తీసుకొని 30వ తేదీ నుండి మద్యస్థ గ్రామాలలో 8 కౌంటర్లు,పెద్ద గ్రామ పంచాయతీల్లో 12 కౌంటర్లు ప్రణాళికలోకి తీసుకోవాలన్నారు.జిల్లాలోని 5 మున్సిపాలిటీలలో వార్డుల వారీగా సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు.ప్రతి గ్రామంలోనూ ఉదయం 8 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు,రెండవ సమావేశం మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు.
దరఖాస్తులను ప్రభుత్వమే ప్రజలకు అందజేస్తుందని మహాలక్ష్మి పథకం,రైతు భరోసా పథకం, గృహజ్యోతి పథకం, ఇందిరమ్మ ఇల్లు పథకం, చేయూత పథకాలకు అర్హులైన వాళ్లు దరఖాస్తులు అందించవలసి ఉంటుందన్నారు.ప్రజా పాలనపై ప్రతి గ్రామంలో మున్సిపల్ వార్డులలో విస్తృత ప్రచారం చేపట్టాలని దండోరా చేపట్టాలని,టామ్ టామ్ చేయించాలని కలెక్టర్ తెలిపారు.