సూర్యాపేట జిల్లా:ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణానదిపై డాక్టర్ కె.ఎల్.
రావు సాగర్ (పులిచింతల ప్రాజెక్టు) నిర్మాణం పూర్తి చేసుకుంది.ఈ ప్రాజెక్ట్ ముంపు కింద ఉమ్మడి నల్గొండ జిల్లా,ప్రస్తుత సూర్యాపేట జిల్లాలోని అడ్లూరు,వెల్లటూరు,కృష్ణాపురం,చింతిరియాల,రేబల్లె, నెమలిపురి,శోభనాద్రిగూడెం,సుల్తాన్ పూర్ తండా, మట్టపల్లి,గుండ్లపల్లి,తమ్మారం,పిక్లానాయక్ తండ, గుండెబోయినగూడెం తదితర 13 గ్రామాలను పునరావాస కేంద్రాలకు తరలించారు.
ఏండ్లు గడిచినా నిర్వాసిత ప్రజలకు అప్పటి ప్రభుత్వం కేటాయించిన విధంగా ప్యాకేజీలు నేటికీ అందకపోవడం గమనార్హం.పదేండ్లు గడిచినా పునరావాస గ్రామాల్లో నేటికీ పాఠశాలు,అంగనవాడి కేంద్రాలు, దేవాలయాలు లేవు.
గ్రామ పాలన చేసే గ్రామ పంచాయతీ కార్యాలయం కూడా లేదు.పునరావాసం ఏర్పాటు చేసే సమయంలో 18 ఏళ్లు నిండిన పిల్లలకు ఇంటి స్థలాలు ఇస్తామని చెప్పారు.
కానీ,ఇంత వరకు ఎలాంటి ఇంటి స్థలాలు లేక ఒకే ఇంట్లో పెళ్లిళ్లైన కొడుకులతో పాటూ తల్లితండ్రులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.నూతన కేంద్రాలలో ప్రభుత్వం దేవాలయాలు,చర్చ్ లు,మసీదులు నిర్మాణం చేసేందుకు టెండర్లు కూడా పిలిచారు.
కానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి నేటికీ ఎలాంటి ప్యాకేజీలు అందలేదు.నేటికీ కొన్ని గ్రామాల్లో ఇళ్లు నిర్మాణం కాలేదు.
ఇళ్లు నిర్మించిన గ్రామాల్లో గుళ్ళు నిర్మాణానికి నోచుకోలేదు.గుండెబోయినగూడెం పునరావాస కేంద్రంలో కాంట్రాక్టర్ చర్చి నిర్మాణ పనులు చేపట్టి,ప్రభుత్వం కేటాయించిన డబ్బులు సరిపోవడంలేదని మధ్యలోనే ఆపేశారు.
పలుమార్లు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండాపోయింది.పునరావాస ప్రజల పరిస్థితి పై స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి నిండు అసెంబ్లీలో మాట్లడుతూ పులిచింతల నిర్వాసితులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వివక్షకు గురయ్యారు.13 గ్రామాలకు కూలీ వేతనాలకు అనుగుణంగా ప్యాకేజీలు రాలేదు.18 ఏళ్లు నిండిన వారికి ప్లాట్లు ఇవ్వలేదు.భూములకు సరైన నష్టపరిహారం చెల్లించలేదు.ప్రస్తుతం పులిచింతల బ్యాక్ వాటర్ తో 200 ఎకరాలు ముంపుకు గురవుతున్నాయి.రావిపహాడ్, మహంకాళిగూడెం భూములను అంచనా వేయకపోవడంతో ముంపుకు గురవుతున్నాయి.తెలంగాణ రాష్ట్రంలో అందరినీ ఆదుకుంటామని చెప్పారు.
చెప్పి ఏళ్లు గడిచినా నేటికి సమస్యలు తీరలేదు.దీనితో పాలకులు మాటలు చెప్పడమే కానీ,అమలు చేసే వారు లేరని, పాలకులకు తమ గోడు ఎప్పుడు పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైనా తెలంగాణ సర్కార్ పులిచింతల పునరావాస కేంద్రాలపై దృష్టి సారించి తమకు అందాల్సిన పరిహారం అందివ్వాలని కోరుతున్నారు.