సూర్యాపేట జిల్లా:వ్యర్ధాలు ఎప్పటికీ వృధా కాబోవని వాటినుండి అద్భుతాలు సృష్టించొచ్చని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.వృధా అనుకున్న వస్తువుల గురించి ఒక్కసారి లోతుగా అధ్యయనం చేయగలిగితే అదే మరో వస్తువుకు ముడి సరుకుగా మారుతుందని ఆయన తెలిపారు.
సూర్యాపేట పురపాలక సంఘం ఆధ్వర్యంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్ల నుండి తయారు చేసిన ఆక్యుపేజర్ బోర్డ్స్,ఇటుకలు,టైల్స్ ను మంత్రి జగదీష్ రెడ్డి ఆవిష్కరించారు.వ్యర్థం అనుకున్న దాంట్లో నుండి అద్భుతాలు సృష్టించిన సూర్యాపేట పురపాలక సంఘాన్ని ఆయన అభినందించారు.
ఇప్పటికే వాడి పారేసిన ప్లాస్టిక్ కవర్లను రీ-సైక్లింగ్ చేస్తున్న సూర్యాపేట మున్సిపాలిటీ ఆ ముద్దలను హెచ్ డి పి యి పైప్ ల తయారీకి అమ్మి ఆదాయం సమకూర్చుకోవడం అభినందనీయమన్నారు.ఇప్పుడు తాజాగా మరో అద్భుతాన్ని సృష్టించిన సూర్యాపేట పురపాలక సంఘం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లతో ఆక్యుపేజర్ బోర్డ్స్,ఇటుకలు,టైల్స్ తయారు చేయడం స్వాగతిస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్, కమిషనర్ రామంజుల్ రెడ్డి,స్వచ్ఛ సర్వేక్షన్ అంబాసిడర్ పెద్దిరెడ్డి గణేష్,కౌన్సిలర్లు చింతలపాటి భరత్ మహాజన్,ఎస్.కె.తాయెర్,బండారు రాజా, మున్సిపల్ డి.ఇ సత్యరావు,సానిటరీ ఇన్స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్,బండి జనార్దన్ రెడ్డి,రాజిరెడ్డి, ఎన్విరాన్ మెంటల్ ఇంజనీర్ శివ ప్రసాద్, ఎస్.ఎస్.ఆర్.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.