సూర్యాపేట జిల్లా: గ్రామాలను పరిశుభ్రంగా వుంచాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం కాగిత రామచంద్రపురంలో లక్షలు ఖర్చుచేసి డంపింగ్ యార్డ్ నిర్మించింది.కానీ,గ్రామ కార్యదర్శి,సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఆ డంపింగ్ యార్డ్ ఉపయోగంలో లేకుండా ఉత్సవ విగ్రహంలా మారి పోయిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
డంపింగ్ యార్డ్ కు తరలించాల్సిన చెత్తను నాగార్జునసాగర్ ఎడమ కాలువ కట్టపై డంపు చేసి,నిత్యం నిప్పుపెట్టి కాల్చి వేస్తుండటంతో స్థానిక ప్రజలు, వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారని వాపోతున్నారు.
కేవలం గ్రామ పంచాయతీ కార్యదర్శి పర్యవేక్షణ లోపంతోనే పారిశుద్ధ్య సిబ్బంది చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి డంపింగ్ యార్డ్ ను ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.ఇదిలా ఉంటే నడిగూడెం మండలంలో 15 గ్రామాల్లో లక్షలు వెచ్చించి సెగ్రిగేషన్ షెడ్లను నిర్మించగా అధికారుల నిర్లక్ష్యంతో అస్తవ్యస్తంగా మారాయని,
పంచాయతీ ట్రాక్టర్ల ద్వారా ఇంటింటి నుంచి సేకరించిన చెత్తను తడి,పొడి చెత్తగా వేరు చేసి సేంద్రీయ ఎరువులను తయారు చేయాలనేది ఉద్దేశ్యమని, కానీ,ఒక్క పంచాయతీలో కూడా అలాంటి పరిస్థితి కనిపించడం లేదని తెలుస్తోంది.
అసలుకొన్ని గ్రామాల్లో చెత్త సేకరించడం కూడా మానేశారని,దీనితో ప్రభుత్వ లక్ష్యాలు పూర్తిగా నీరుగారిపోతున్నాయని మండల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.