సూర్యాపేట జిల్లా:జిల్లాలో ప్రజా పాలన నేటి నుండి పక్కా ప్రణాళికతో నిర్వహిస్తామని ఇంచార్జి జిల్లా కలెక్టర్ సిహెచ్.ప్రియాంక అన్నారు.
కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనవు ఎస్పీ నాగేశ్వరరావుతో కలసి ప్రజాపాలన నిర్వహణపై మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల 28 నుండి 2024 జనవరి 06 వరకు ప్రజా పాలన నిర్వహణ షెడ్యూల్ ను ఏర్పాటు చేయడం జరిగిందని,పక్కా ప్రణాళికతో జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలలో ప్రజా పాలన కార్యక్రమం ఉదయం 8 నుండి మధ్యాహ్నం 12 వరకు అలాగే మద్యాహ్నం 2 నుండి సాయంత్రం 6 వరకు కార్యక్రమం నిర్వహణ ఉంటుందని పేర్కొన్నారు.
మొదట రోజు 116 గ్రామ సభలు నిర్వహిస్తున్నామని,అలాగే ప్రతి వంద కుటుంబాలకు ఒక కౌంటర్ ను ఏర్పాటు చేశామని తెలిపారు.ఈ ప్రజాపాలనలో మహాలక్ష్మి, రైతు భరోసా,గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు అలాగే చేయూత పథకాలపై దరఖాస్తులు స్వీకరిస్తామని అన్నారు.
ముందుగా దరఖాస్తులను ఇప్పటికే అన్ని జిపిలు, మున్సిపాలిటీలలో ప్రజలకు అందేలా చర్యలు తీసుకున్నామన్నారు.ప్రజలు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా అన్ని పంచాయతీలు, మున్సిపాలిటీలలో మౌలిక వసతులు కల్పిచనున్నట్లు తెలిపారు.
గ్రామ సభలు నిర్వహించిన రోజు లబ్ధిదారులు సమయానికి దరఖాస్తులు అందించక పోతే మరుసటి రోజున సంబంధిత గ్రామ పంచాయతీలో అందచేసి రసీదులు తీసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.లబ్ధిదారులు దరఖాస్తులతో పాటు రేషన్ కార్డు,ఆధార్ కార్డు తప్పక జత చేయాలని రేషన్ కార్డు లేని వారి దరఖాస్తులు కూడా స్వీకరిస్తామని తెలిపారు.
జిల్లాలో 475 జిపిలలో 247 సభ్యులతో 46 టీమ్స్ అలాగే 2581 కౌంటర్లు ఏర్పాటు చేశామని తెలిపారు.అదేవిధంగా 5 మున్సిపాలిటీలలో 141 వార్డులలో 52 సభ్యులతో 12 టీమ్స్ అలాగే 844 కౌంటర్లు ఏర్పాటు చేశామని,మొత్తం 616 వార్డులు,జిపిలకు గాను 299 సభ్యులతో 58 టీమ్స్,3425 కౌంటర్లను ఏర్పాటు చేసామని వివరించారు.
ఈ కార్యక్రమంలో డిపిఆర్ఓ ఏ.రమేష్ కుమార్,డిఈ మల్లేశం,ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.