సూర్యాపేట జిల్లా: 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతుర్తి ప్రజలు ఏ విధంగా మందుల సామేలు 50వేల పైచిలుకు మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిపించారో అదే విధంగా గత 15 ఏళ్లుగా ఎన్.ఎస్.యు.ఐ,యూత్ కాంగ్రెస్ ద్వారా అనునిత్యం పార్టీ కోసం కష్టపడి,అనేక ఉద్యమాలు,పోరాటాలు చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి క్రియాశీలకంగా పనిచేసిన భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని ఐదు లక్షల భారీ మెజారిటీతో గెలిపించాలని రాష్ట్ర రోడ్లు,భవనాలు, సినిమాటోగ్రఫి శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.ఆదివారం సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండల కేంద్రం నుండి అడివెంల వరకు స్ధానిక ఎమ్మెల్యే మందుల సామేలు ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీకి ఆయన ముఖ్యాతిథిగా హాజరై స్వయంగా బుల్లెట్ నడుపుతూ వెనుక భువనగిరి ఎంపీ అభ్యర్ధి చామల కిరణ్ కుమార్ రెడ్డి కూర్చోబెట్టుకొని అభివాదం చేయిస్తూ కార్యకర్తల్లో జోష్ నింపారు.
అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ…తుంగతుర్తి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటారని, నాయకులు,కార్యకర్తలు ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ ఐదు గ్యారెంటీల గురించి వివరించాలని,ఈ 30 రోజులు కష్టపడి హస్తం గుర్తుపై ఓటేయాలని ప్రచారం చేయండని సూచించారు.30 రోజులు మీరు కష్టపడండి,48 నెలలు మేము మీకు అండగా ఉంటామని, అర్ధరాత్రి,అపరాత్రి అయినా మీకు ఏ ఇబ్బంది కలిగిన మీ ముంగట ఉంటామని భరోసా ఇచ్చారు.ఐదేళ్లు మీకు అండగా మేము ఉంటామని,మీకు ఏ కష్టం వచ్చినా మంత్రిగా నేను, ఎమ్మెల్యే సామేల్,ఎంపీగా కిరణ్ కుమార్ రెడ్డి వస్తామని,మా జిల్లా నాయకులు వచ్చి ఆదుకుంటారని,మీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందన్నారు.
బీఆర్ఎస్ పార్టీ లాగా దోచుకుతినే పార్టీ కాదని, కాంగ్రెస్ పార్టీ ఆదుకునే పార్టీ అని తెలిపారు.పేద ప్రజలను ఆదుకోవాలని సోనియా గాంధీ ఆనాడు ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించి పేద ప్రజలకు కడుపునింపారని గుర్తు చేశారు.
ఈ 30 రోజులు ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేసి పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని కార్యకర్తలను,నాయకులను,ప్రజలను కోరారు.