సూర్యాపేట జిల్లా:కోదాడ నియోజకవర్గ( Kodad ) పరిధిలోని మోతె,మునగాల,నడిగూడెం,కోదాడ,అనంతగిరి,కోదాడ మండలాల్లో భూగర్భ జలాలు అడుగంటి బోర్లు,బావులు,చెరువులు ఎండిపోవడంతో ప్రజలు త్రాగునీటి కోసం తన్నులాడుతున్నారు.ఎన్నడూ లేని విధంగా మార్చిలోనే ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగడంతో పల్లెల్లో నీరు లేక కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.
నీటి సమస్యపై ( Water problem )యుద్ద ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని మంత్రులు,ఎమ్మెల్యేలు,కలెక్టర్లు ఆదేశాలు జారీ చేస్తున్నాపల్లెల్లో పట్టించుకునే నాథుడే కరువయ్యాడని,దీనితో పల్లె ప్రజల గొంతు తడిపే మార్గం కనిపించడం లేదని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇక తండాల్లో నీటి సమస్య మరింత దారుణంగా ఉందని, నీటి కోసం తండావాసులు సుదూర ప్రాంతాల్లోని వ్యవసాయ బోర్లు,బావుల వద్ద తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొందని వాపోతున్నారు.
నీటి లభ్యత ప్రాంతాలకు వెళ్లి టాకర్లతోటి నీళ్లు తెచ్చుకొని డ్రమ్ములు,గాబులు,బకెట్లు, బిందెల్లో నింపుకొని పొదుపుగా వాడుకుంటూ కాలం ఎల్లదీస్తున్నారు.మార్చి నెలలోనే ఈ పరిస్థితి ఏర్పడితే రానున్న ఏప్రిల్,మే,జూన్ నెలల్లో ఎట్లా బ్రతకాలని ఆందోళన చెందుతున్నారు.
ప్రభుత్వ ఆదేశాలు కేవలం పేపర్ ప్రకటనలకే పరిమితం అవుతున్నాయని,స్థానిక అధికారులు నీటి సమస్యపై తీసుకునే చర్యలు శూన్యమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకుని గ్రామాల్లో చేతి పంపులు,ప్రభుత్వ బోర్లు రిపేర్ చేయించి,ప్రైవేట్ బోర్లు అద్దెకు తీసుకుని నీటి ఎద్దడి లేకుండా చూడాలని కోరుతున్నారు.